చైనాపై మరోమారు విరుచుకుపడ్డారు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో. చైనాపై తమ విధానాల్లో మార్పులు ఉంటాయన్న పాంపియో.. ఇక మీదట "అవిశ్వాసం- ధ్రువీకరణ" వంటి పద్ధతులను అవలంభించనున్నట్టు వెల్లడించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో 'కమ్యూనిస్ట్ చైనా అండ్ ద ఫ్రీ వరల్డ్స్ ఫ్యూచర్' అంశంపై ప్రసంగించిన అగ్రరాజ్య విదేశాంగమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"చైనా నేతల మాటల కన్నా.. వారి చేష్టలను పరిగణించి మనం చర్యలు చేపట్టాలి. అప్పుడే కమ్యూనిస్ట్ చైనాను మార్చగలం. సోవియట్ మీద మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ 'నమ్ము.. కానీ ధ్రువీకరించుకో' అనే విధానాన్ని పాటించేవారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ విషయానికొస్తే.. పాత విధానాలు విఫలమయ్యాయి. అందువల్ల చైనాపై 'అవిశ్వాసం- ధ్రువీకరించుకోవడం' అనే విధానాలను పాటించాలని నేను అంటాను."
--- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ.. తన ప్రవర్తనను మార్చుకునే విధంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు పాంపియో. ఒకవేళ ప్రపంచ దేశాలు కమ్యూనిస్ట్ చైనాను మార్చకపోతే.. అదే ప్రపంచాన్ని మార్చేస్తుందని హెచ్చరించారు.