అమెరికా పార్లమెంట్ భవనంపై గత బుధవారం జరిగిన దాడిలో బాంబులు సైతం ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఓవైపు హింసాకాండ కొనసాగుతున్న సమయంలో.. భద్రతా దళ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైనట్లు తాజాగా తేలింది. వాషింగ్టన్ డీసీలోని రిపబ్లికన్, డెమొక్రటిక్ నేషనల్ కమిటీల కార్యాలయాలకు అతిసమీపంలోనే రెండు పైపు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు క్యాపిటల్ పోలీసులు, ఎఫ్‌బీఐ, సహా సహాయక బృందాలు రిపబ్లికన్ నేషనల్ కమిటీకి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. ముప్పై నిమిషాల తర్వాత అదే తరహా పరికరం డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు చెప్పారు. ఈ రెండు పరికరాలు ఒకే విధంగా ఉన్నాయని, బాంబులకు టైమర్‌ను సైతం అమర్చారని తెలిపారు. అందులో గుర్తుతెలియని పౌడర్, లోహాలు ఉన్నట్లు తెలిపారు. వాటి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.