తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా సభలో ట్రంప్​పై అభిశంసన తీర్మానం - representative of america

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు స్పీకర్​ నాన్సీ పెలోసీ. రాజకీయ ప్రత్యర్థికి నష్టం కలిగించేందుకు విదేశీ శక్తులను ట్రంప్​ ఆశ్రయించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్

By

Published : Sep 25, 2019, 11:37 AM IST

Updated : Oct 1, 2019, 10:59 PM IST

అమెరికా సభలో ట్రంప్​పై అభిశంసన తీర్మానం

అమెరికా రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను గద్దె దించేందుకు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు డెమొక్రాట్లు.

ప్రత్యర్థి, డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​కు నష్టం కలిగించేందుకు విదేశీ శక్తులను ట్రంప్​ ఆశ్రయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా విచారణ ప్రారంభించామని సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ ప్రకటించారు.

"ప్రతినిధుల సభలో అధికారికంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తున్నా. సభకు చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ అభిశంసన తీర్మానాన్ని విచారించాలని ఆదేశిస్తున్నా. అధ్యక్షుడు జవాబుదారీగా వ్యవహరించాలి. చట్టానికి ఎవరూ అతీతులు కారు."

-నాన్సీ పెలోసీ, ప్రతినిధుల సభ స్పీకర్

ట్రంప్​పై వచ్చిన ఆరోపణలు

జో బైడెన్​ను రాజకీయంగా ఎదుర్కోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెంస్కీతో గతంలో ట్రంప్​ మాట్లాడారని ఓ ప్రజావేగు సంస్థ ఫిర్యాదు చేసింది. అందులోని కొన్ని అంశాలు...

⦁ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెంస్కీ ఈ ఏడాది జులై 25న ఫోన్లో మాట్లాడారు.
⦁ జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్​ బైడెన్​పై అవినీతి కేసుల్లో దర్యాప్తు చేయాలని జెలెంస్కీపై ట్రంప్​ ఒత్తిడి తీసుకొచ్చారు.
⦁ ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం ఉపసంహరించుకుంటామని బెదిరించారు.
⦁ ఈ ఫోన్ కాల్‌కు దాదాపు వారం ముందు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేయాలని ట్రంప్ తన అధికారులను ఆదేశించినట్లు వాషింగ్టన్ పోస్ట్, అమెరికా మీడియా చెప్పాయి.

ఖండించిన ట్రంప్​

ఆరోపణలను ట్రంప్​ ఖండించారు. జెలెంస్కీతో జో, హంటర్​ విషయమై మాట్లాడింది నిజమే అయినా వారిని ఒత్తిడి చేశానన్నది మాత్రం నిరాధారమని తెలిపారు. డెమొక్రాట్ల మీడియా ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయటం సహజమేనని విమర్శించారు.

ట్రంప్ ట్వీట్​

"జెలెంస్కీతో నా ఫోన్ సంభాషణపై ఎలాంటి సమాచారం లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అది కేవలం స్నేహపూర్వకమైన.. అధికారిక సంభాషణ. ఇందులో ఒత్తిడి లేదు. జో బైడెన్​, అతడి కుమారుడికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదు. ఇదంతా కూడగట్టుకుని చేస్తున్న ప్రచారం అంతే."

-డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

జో బైడెన్​ సమర్థన

కాంగ్రెస్​ నిర్ణయాన్ని జోబైడెన్​ సమర్థించారు. అధ్యక్షుడి హోదాలో ఉండి చట్టానికి, దేశానికి అతీతంగా పనిచేయటం తగదని అన్నారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా అమెరికా వ్యవహారాల్లో విదేశీ సాయం కోసం అర్జించటం దారుణమని అభిప్రాయపడ్డారు.

"అభిశంసన.. దురదృష్టకరమైన నిర్ణయం. కానీ ఇది ట్రంప్​ స్వయంకృతం. అమెరికా ఒక ప్రత్యేకమైన, భిన్నమైన దేశం. చరిత్రలో మిగతా దేశాలకంటే ఎంతో మెరుగైనది. స్వయం పరిపాలనను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది మనమే. మిగతా దేశాలకు మార్గదర్శిలా వ్యవహరిస్తున్నాం. డొనాల్డ్​ ట్రంప్ ఎవరో మనకు తెలుసు. ప్రపంచానికి మనమేంటో తెలియాలి."

-జో బైడెన్​, డెమొక్రాట్ నేత

ప్రతినిధుల సభలో సుమారు 235 మంది డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని సమర్థిస్తున్నారు. ఫలితంగా దిగువ సభలో తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. అయితే అమెరికా సెనేట్​లో రిపబ్లికన్లదే పైచేయి కావటం వల్ల ఎగువ సభలో తీర్మానం వీగిపోతుందని పలువురు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: మోదీ భారత జాతిపిత..!: డొనాల్డ్​ ట్రంప్​

Last Updated : Oct 1, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details