అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై సెనేట్‌లో సుదీర్ఘ చర్చ సాగుతోంది. మూడు రోజుల వాడీవేడీ చర్చల అనంతరం డెమొక్రాట్లు తమ వాదనలను పూర్తి చేశారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని... ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని హౌజ్ మేనేజర్లు డిమాండ్ చేశారు.
ట్రంప్ అభిశంసనపై ప్రతినిధుల సభ న్యాయవిచారణ బృందానికి సారథ్యం వహిస్తున్న అడమ్ స్కిఫ్... కాంగ్రెస్ కార్యకలాపాలకు ట్రంప్ ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
డెమొక్రాట్ల వాదనలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి ట్రంప్‌కు చెందిన అటార్నీలు తమ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లలాగే వీరికీ మూడురోజుల సమయం ఇవ్వనున్నారు.