డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ మూలాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారిస్ అమెరికాలో పుట్టలేదని తాను విన్నట్లు చెప్పారు.
"నేను ఇప్పుడే విన్నా. కమలా హ్యారిస్ అమెరికాలో పుట్టలేదు. డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ఇది ముందే తనిఖీ చేసి ఉంటారు. విదేశీ మూలాలు ఉన్నందున శ్వేతసౌధానికి సేవ చేసే అర్హత ఆమెకు లేదు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత ఆమెకు లేదని న్యాయ నిపుణులు చెప్పారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఖండించిన బైడెన్..
ట్రంప్ వ్యాఖ్యలను డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ట్రంప్ జాత్యాహంకార ధోరణికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. హ్యారిస్ అమెరికాలోనే జన్మించారని, దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు స్పష్టం చేశారు.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పుట్టుకకు సంబంధించి కూడా ప్రత్యర్థులు పలు విమర్శలు సంధించారని గుర్తుచేశారు.
మొదలైంది ఇక్కడ..
హ్యారిస్‌కు సంబంధించిన ఈ కుట్రను మొదట న్యూస్‌వీక్ అధిపతి డాక్టర్ జాన్ ఈస్ట్‌మన్ ప్రారంభించారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌కు పోటీ చేసి హ్యారిస్ చేతిలో ఓడిపోయారు ఈస్ట్‌మన్. అటార్నీ పదవికి హ్యారిస్ అర్హతలపై అనుమానాలు ఉన్నాయని అప్పట్లో ఈస్ట్‌మన్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కుట్ర సిద్ధాంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి:ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?