తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2020, 7:26 PM IST

Updated : Nov 17, 2020, 8:10 PM IST

ETV Bharat / international

'వ్యక్తిగత అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది'

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్​ను ఉద్దేశించి బరాక్​ ఒబామా సతీమణి మిచెల్​ ఒబామా పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార మార్పిడి ప్రక్రియను ఆలస్యం చేయటం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు.

Democracy Bigger than Ego says Michelle Obama
'వ్యక్తిగత అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది’

అమెరికాలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్‌ దానిని అంగీకరించటం లేదు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ కోర్టుల్లో దావాలు వేశారు. మరోవైపు డెమొక్రాట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హుందాగా అధికార మార్పిడికి ట్రంప్‌ సహకరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ, బరాక్‌ ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. 'అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

అలా చేస్తేనే ప్రజాస్వామ్యానికి బలం

"డెమొక్రాట్లను ఓడించి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చాలా బాధపడ్డా. కానీ, అప్పట్లో అమెరికన్‌ ఓటర్లు ట్రంప్‌నకు పట్టం గట్టారు. ఓటమిని అంగీకరించి, అధికార మార్పిడికి సహకరించాం. అంతకుముందు జార్జి బుష్‌, లారా శ్వేతసౌధాన్ని వీడినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు అలాగే చేయాలని సిబ్బందికి చెప్పాం. ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడి జరగడం అమెరికా ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుంది" అని మిచెల్‌ ఒబామా అన్నారు.

హుందాగా వ్యవహరించాం

అప్పట్లో తనపైనా, ఒబామాపైనా అధ్యక్షుడు ట్రంప్‌ బురదజల్లే ప్రయత్నం చేశారని, తమని అప్రతిష్ఠపాలు చేయాలని చూశారని మిచెల్‌ మండిపడ్డారు. అయినప్పటికీ కోపాన్ని పక్కనపెట్టి హుందాగా మెలానియా ట్రంప్‌ను శ్వేతసౌధానికి ఆహ్వానించానని మిచెల్‌ గుర్తు చేశారు.

ఆహ్వానిస్తారా?

అధ్యక్షుడు ట్రంప్‌ ఓటమిని అంగీకరించక పోవడంతో అమెరికాలో అధికార మార్పిడి ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా సంప్రదాయాల ప్రకారం ప్రస్తుత ప్రథమ మహిళ, అధ్యక్షుడిగా ఎన్నికైనవారి భార్యను శ్వేతసౌధానికి ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ను మెలానియా ఆహ్వానిస్తారా? లేదా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది.

అధికార మార్పిడి ప్రక్రియను ఆలస్యం చేయడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని మిచెల్‌ అభిప్రాయపడ్డారు. "ఇది ఆట కాదు. అమెరికా రాజకీయాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజాస్వామ్యం వ్యక్తిగత అహం కంటే చాలా పెద్దది అని మిచెల్‌ అన్నారు.

Last Updated : Nov 17, 2020, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details