కరోనా వైరస్ డెల్టా వేరియంట్(Delta variant) ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ స్ట్రెయిన్ కారణంగా ప్రపంచ దేశాల్లో కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రకం వేరియంట్ ప్రస్తుతం 104 దేశాల్లో వెలుగుచూసిందని, దీని తీవ్రత ప్రపంచంపై భారీగా పడే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్(WHO chief) వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా వరుసగా నాలుగో వారం కూడా కేసులు సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు టెడ్రోస్. అయితే 10వారాల పాటు వరుసగా కేసులు తగ్గిన ఆరు ప్రాంతాల్లో వైరస్ మళ్లీ తిరగబెట్టడం ఆందోళనకరమన్నారు.
"ప్రపంచంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి అత్యంత ఆందోళనకరంగా ఉంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రజా ఆరోగ్య వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోంది. దీని వల్ల ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థకు మరింత ముప్పు ఏర్పడే అవకాశముంది."
-- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్.
ఇక వ్యాక్సిన్లు తక్కువగా లభిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషమం అని పేర్కొన్నారు టెడ్రోస్. డెల్టా వేరియంట్ పంజాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివరించారు. తొలినాళ్లల్లో కరోనాను కట్టడి చేసి ప్రశంసలు పొందిన దేశాలు కూడా ఇప్పుడు చేతులెత్తేశాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎక్కువ మోతాదులో, ముందస్తుగానే టీకాలను ఆర్డర్ ఇచ్చుకుంటున్నాయని.. దీని వల్ల అనేక దేశాల్లో కనీసం ఆరోగ్య కార్యకర్తలకు కూడా టీకాలు అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
"అగ్నిప్రమాదాన్ని నిలువరించేందుకు సిబ్బందికి ఎలాంటి కిట్లు ఇవ్వకుండా పంపిస్తారా? మరి ఈ సంక్షోభం ఎక్కువ ప్రభావితం చేస్తోంది ఎవరిని? ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులను. మరి వారికి టీకాలు అందకపోవడం అత్యంత విషాదకరం."
--- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్.
ఇప్పటికీ ఒక్క డోసు కూడా తీసోకోని జనాభాకు టీకాలు తక్షణమే అందించాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ తెలిపారు.
ఇదీ చూడండి:-Alpha, Beta: 90 ఏళ్ల వృద్ధురాలిలో రెండు వేరియంట్లు!