కరోనా డెల్టా వేరియంట్‌పై అమెరికా ఆరోగ్య విభాగం విస్తుగొలిపే విషయాలు వెల్లడించింది. ఈ వేరియంట్ అంతకుముందు ఉన్న ఉత్పరివర్తనాల కన్నా.. తీవ్రమైన వ్యాధి ప్రభావానికి కారణమవ్వగలదని తెలిపింది. చికెన్‌పాక్స్ తరహాలో సులభంగా ఇతరులకు వ్యాపించగలదని చెప్పింది. ఈ మేరకు అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) రూపొందించిన పత్రాల్లోని సమాచారాన్ని అక్కడి మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి.
వ్యాక్సిన్ తీసుకున్నా..
వ్యాక్సిన్ తీసుకోనివారికి, రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకే అవకాశాలు సమానస్థాయిలో ఉన్నాయని సీడీసీ తన పత్రాల్లో పేర్కొంది. ఈ పత్రాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ తొలుత ప్రచురించింది. అంతకుముందు కరోనా టీకా తీసుకున్నప్పటికీ... బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని సీడీసీ డైరెక్టర్ రాచెల్లె పీ వాలెన్స్కీ మంగళవారం తెలిపారు. అయితే.. ఇప్పుడు సీడీసీ పత్రాల ద్వారా డెల్టా వేరియంట్ వ్యాప్తిపై మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.