ప్రపంచ దేశాలను డెల్టా వేరియంట్(Delta variant) గడగడలాడిస్తోంది. ఈ వేరియంట్ కారణంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. చాలా మంది కొవిడ్ టీకా(Covid vaccine) తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయినా.. టీకాల ద్వారా వారు త్వరగా కోలుకోగలుగుతున్నారు. కానీ, అదే సమయంలో కొవిడ్‌ను జయించిన కొంతమంది మాత్రం తమలో యాంటీబాడీలు ఉంటాయని భావించి టీకా తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అసలు టీకా తీసుకోవడం ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తికి, సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తికి మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇమ్యూనిటీ ఎలా?
కరోనా నుంచి ఎవరైనా... రెండు మార్గాల్లో రోగ నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని పొందుతారు. ఒకటి- కరోనా బారినపడి కోలుకోవడం ద్వారా(సహజ రోగ నిరోధక శక్తి). రెండోది- టీకా తీసుకోవడం ద్వారా. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వచ్చే రోగ నిరోధక శక్తికి, టీకాలతో వచ్చే రోగ నిరోధక శక్తికి మధ్య తేడా ఉండటం వల్ల.. కరోనా కొత్త వేరియంట్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జులైలో ప్రచురితమైన ఓ రెండు కథనాల్లో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు.. కొవిడ్ పాత వేరియంట్ల కన్నా కొత్త వేరియంట్లపై కాస్త తక్కువ ప్రభావవం చూపుతున్నాయని తేలింది. అయితే.. కొత్త వేరియంట్లపైనా రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన అధికంగానే ఉందని చెప్పాయి.
కొత్త వేరియంట్లపై టీకాలు సేఫ్..
కొత్త వేరియంట్లపై యాంటీబాడీలు ఎలా స్పందిస్తున్నాయనే దానిని పరిశోధకులు విశ్లేషించారు. గతంలో కొవిడ్ బారిన పడినప్పటికీ.. కొత్త వేరియంట్ల కారణంగా మళ్లీ కరోనా బాధితులుగా మారే అవకాశం ఉందని వారు గుర్తించారు. అయితే.. టీకాలు తీసుకునే వారికి మాత్రం కరోనా కొత్త వేరియంట్ల నుంచి పెద్దగా ప్రమాదం లేదని తెలుసుకున్నారు. కరోనా పాత వేరియంట్లు, డెల్టా వేరియంట్ లాంటి ప్రస్తుత వేరియంట్లపై టీకాలు మంచి రక్షణ అందించగలవని నిర్ధరణ అయింది.
సహజ రోగ నిరోధక శక్తి ఎలా?
వైరస్ లక్షణాలను రోగ నిరోధక వ్యవస్థ గుర్తుంచి అందుకు తగ్గట్లుగా ప్రతిస్పందించడం వల్ల రోగ నిరోధక శక్తి వస్తుంది. యాంటీబాడీల విషయానికి వస్తే అవి మన శరీరంలో ఉండే ప్రొటీన్లు. వైరస్‌కు వ్యతిరేకంగా పని చేసి అవి మనల్ని రక్షిస్తాయి. వైరస్‌ను ఎదుర్కోవడంలో టి కణాల పాత్ర చాలా కీలకమైనది. ఇన్ఫెక్షన్కు గురైన కణాలను గుర్తించి వాటిని తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
ఇదీ చూడండి:Vaccine Mixing: ' రెండు వేర్వేరు టీకాలు కలిపితే అంతే!'
అందరిలో ఉండదు..
అయితే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలోనూ.. ఇమ్యూనిటీ ఉండదు. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్నవారిలో 9శాతం మందిలో అసలు యాంటీబాడీలే లేనట్లు తేలింది. వైరస్ నుంచి కోలుకున్న నెలరోజుల తర్వాత పరీక్షించగా.. 7శాతం మందిలో టి కణాలే లేనట్లు గుర్తించారు. మరోవైపు.. అందరిలోనూ ఈ రోగ నిరోధక శక్తి వ్యవధి ఒకేలా ఉండదు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కొన్ని నెలల్లోనే దాదాపు 5శాతం మంది తమ రోగ నిరోధక శక్తిని కోల్పోయినట్లు ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్ నుంచి కోలుకున్న నెలరోజులకే మళ్లీ వైరస్ బారిన పడిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత 88శాతం మందిలో పాత వేరియంట్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి.. 12 నెలలపాటు ఉందని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది. కానీ, వారిలో 50శాతం కంటే తక్కువ మందిలో మాత్రమే డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైంది. ఈ ఫలితాల ఆధారంగా పాత వేరియంట్ల బారినపడిన వారు.. ప్రస్తుతం విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా వ్యాధి బారినపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
వీటన్నింటి కంటే.. కరోనా నుంచి కోలుకున్నవారు.. తమకు వైరస్ లక్షణాలు లేకపోయినా.. ఇతరులకు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. పాత వేరియంట్ల కంటే అవి సులభంగా వ్యాప్తి చెందుతున్నాయి.
ఇదీ చూడండి:'డెల్టా వ్యాప్తితో ప్రపంచానికి పెను ముప్పు!'
వ్యాక్సినేషన్‌తో సంపూర్ణ రక్షణ..
యాంటీబాడీలుతో పాటు టి-కణాల ప్రతిస్పందననూ టీకాలు ఉత్పత్తి చేస్తాయి. సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తి కన్నా అవి మరింత సుస్థిరంగా ఉంటాయి. మోడెర్నా టీకా మొదటి డోసు తీసుకున్న వారిలో 100 శాతం మందికి కరోనాను ఎదుర్కోగల యాంటీబాడీలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఫైజర్, మోడెర్నా టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీల స్థాయిలు.. కరోనా నుంచి కోలుకున్నవారి కంటే అధికంగా ఉన్నట్లు అందులో వెల్లడైంది. ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో 90శాతం మందికి కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ లభించినట్లు ఇజ్రాయెల్‌లో నిర్వహించిన మరో అధ్యయనం స్పష్టం చేసింది. టీకా తీసుకున్నవారు తమ ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చేసే అవకాశం కూడా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
అయితే.. ఈ పరిస్థితుల మధ్య కరోనా నుంచి కోలుకున్నప్పటికీ టీకా తీసుకునే అవకాశం ఉండటం సానుకూలంగా కనిపిస్తోంది. ముందే టీకా తీసుకున్నవారితో పోల్చితే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత టీకా తీసుకున్నవారిలో 100 రెట్లు అధికంగా యాంటీబాడీలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉన్నట్లు తేలింది.
అయితే కొవిడ్ వ్యాక్సిన్లు అన్ని విధాలుగా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పలేం. కానీ, యాంటీబాడీలను, టి-కణాల ప్రతిస్పందనను అవి సహజ రోగ నిరోధక శక్తి కంటే ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తాయి. టీకాల వల్ల కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది.
ఇదీ చూడండి:ఆ టీకా తీసుకుంటే అతికొద్ది మందికి అరుదైన వ్యాధి!
ఇదీ చూడండి:పోషకాహార సమస్యను పెంచిన కరోనా!