కరోనా వైరస్‌ను పారదోలడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ ముప్పుగా పరిణమించిందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. "మొదట వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అలాగే వ్యాధి తీవ్రతకు కూడా ఇది కారణమవుతోంది. అయితే, ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం" అని ఫౌచీ అన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలతో సహా అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలన్నీ ఈ వేరియంట్‌పై ప్రభావంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
జులై 4 నాటికి 70 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని చేరేందుకు.. అమెరికాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని శ్వేతసౌధ సీనియర్ సలహాదారు జెఫ్రే జీంట్స్ వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం సోమవారం నాటికి.. 45 శాతం మంది ప్రజలు టీకా రెండుడోసులను పొందారు.