దిల్లీలో హింసపై అమెరికా విపక్షాలు స్పందించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు డెమొక్రటిక్ నేత బెర్నీ శాండర్స్. మానవహక్కుల అంశంలో ట్రంప్ విఫలమయ్యారని అన్నారు శాండర్స్. పర్యటన సందర్భంగా దిల్లీలో హింస చెలరేగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
పర్యటనలో భాగంగా దిల్లీ అల్లర్లపై ట్రంప్ పెద్దగా స్పందించలేదు. అల్లర్ల గురించి విన్నప్పటికీ.. మోదీతో అవేం చర్చించలేదని స్పష్టం చేశారు. అది భారత్‌కు సంబంధించిన విషయమని తేల్చిచెప్పారు.
ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు శాండర్స్.
"20 కోట్లకు పైగా ముస్లింలు భారత్‌ను తమ నివాసంలా భావిస్తున్నారు. ముస్లిం వ్యతిరేక మూకలు దాదాపు 27 మందిని చంపేశాయి. చాలా మందిని గాయపరిచాయి. ట్రంప్ స్పందిస్తూ అది 'భారత్‌కు సంబంధించిన అంశం' అని బదులిచ్చారు. మానవహక్కులపై ఇది నాయకత్వ వైఫల్యం."
-బెర్నీ శాండర్స్, అమెరికన్ డెమొక్రటిక్ నేత
అంతకుముందు మరో డెమొక్రటిక్ నేత, సెనేటర్ ఎలిజబెత్ వారెన్ సైతం దిల్లీ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు సెనేటర్లు కూడా దిల్లీ నిరసనల్లో హింసపై విచారం వ్యక్తం చేశారు.
అత్యున్నత ద్వైపాక్షిక బంధం
భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తన తొలి పర్యటనలో ఇరుదేశాల సంబంధాలు మరింత ముందుకెళ్లాయని అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ ఉత్తమ నేత అని కొనియాడారు. భారత్ అత్యద్భుత దేశమని కీర్తించారు. భారత్ ఇచ్చిన ఆతిథ్యంపై అమితమైన సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌తో మరింత వాణిజ్యాన్ని చేయబోతున్నామని తెలిపారు.
ఆతిథ్యానికి కృతజ్ఞత
అమెరికా అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్‌ను(ఐడీఎఫ్సీ) భారత్‌లో ఏర్పాటు చేయడానికి ట్రంప్ అంగీకరించారని ఇవాంకా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉమెన్స్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రోస్పెరిటీ ఇనీషియేటివ్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. భారత ఆతిథ్యంపై మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఇవాంకా.
"భారత్‌తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, అభివృద్ధిని పెంచడం సహా మహిళా ఆర్థిక సాధికారత సాధించడానికి డబ్ల్యూజీడీపీని శాశ్వతంగా ఏర్పాటు చేయబోతున్నాం."
-ఇవాంకా ట్రంప్, అధ్యక్షుడి సలహాదారు
అమెరికా ప్రథమ మహిళ సైతం భారత పర్యటనపై సంతోషం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడితో తాజ్‌మహల్ వద్ద దిగిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు.