రోజుకో కొత్త రుచిని తెలుసుకోవాలని మన నాలుక పరితపిస్తుంది. అందుకోసం మనకు వీలు చిక్కినప్పుడల్లా హోటళ్లకు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు పరుగులు తీస్తాం. కొత్తరకం వంటలు ఏమైనా ఉన్నాయా? అని తెగ వెతికేస్తాం. భోజన ప్రియుల్లో ఇది కొంత ఎక్కువే ఉంటుంది. కరోనా పుణ్యమా అని గతేడాది అందరూ ఇళ్లకు పరిమితమయ్యాక.. చాలా మంది గరిటపట్టారు. ఆన్లైన్లో చూసేసి.. వివిధ రకాల వంటలు వండేశారు. అంతేకాకుండా తమ పాకశాస్త్ర నైపుణ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే అన్నింటిలోకి చాలా భిన్నమైన వంటకం ఒకటి అందరిని ఆకర్షించింది. అదే "డీప్ ఫ్రైడ్ వాటర్". నీటిని ఫ్రై చేయడం ఏంటి వింతగా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ నమ్మి తీరాల్సిందే మరి. చాలా మంది ప్రస్తుతం ఈ వంటకాన్ని ఓ ట్రెండ్‌లా ఫాలో అవుతున్నారు.
అసులు ఏంటీ ఈ డీప్ ఫ్రైడ్ వాటర్?
యూట్యూబర్ జోనాతన్ మార్కస్.. ఈ డీప్ ఫ్రైడ్ వాటర్ సృష్టికర్త. ఏదైనా వంటకాన్ని భిన్నరీతిలో చేసి అందరినీ ఆకట్టుకోవాలని జోనాతన్ చేసిన ప్రయత్నమే ఇది. సాధారణంగా.. వంటకాల్లో మార్పులు చేయడం, మెరుగులు దిద్దడం వంటివి చేస్తారు. కానీ ఇతను మాత్రం ఏకంగా కొత్త వంటకాన్నే కనిపెట్టాడు. ఇతను తయారు చేసిన వంటకానికి ప్రస్తుతం ఆదరణ లభిస్తోంది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ వంటల పోటీల్లో అతను ఈ డీప్ ఫ్రైడ్ వాటర్‌ను రూపొందించాడు.
నీటిని వేయిస్తారు ఇలా..
వంటకాల్లో వినియోగించే జిలాటిన్‌ను పోలి ఉన్న కాల్షియన్ అలిగనైట్ అనే పదార్థాన్ని నీటిలో కలుపుతారు. దాని వల్ల నీరు సెమీ సాలిడ్ స్టేట్‌కు వస్తుంది. దానిని గుడ్డు పచ్చ సొన, పిండి, బ్రెడ్ పొడి కిలిసిన మిశ్రమంలో కలుపుతారు. ఆ తర్వాత దానిని నూనెలో బాగా వేయిస్తారు.