అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల పాత్ర కీలకంగా మారింది. అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీతో పాటు, ప్రతిపక్ష డెమొక్రాటిక్ కూడా మనోళ్ల ఓట్లపై కన్నేశాయి. డెమొక్రాటిక్ పార్టీ అయితే ఏకంగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ను ఉపాధ్యక్ష పదవికి నిలబెట్టింది.
ఓట్ల పరంగా చూస్తే ఇండో-అమెరికన్ల సంఖ్య పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ, ప్రపంచంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై అమెరికాలో మాజీ భారత రాయబారి మీరా శంకర్ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.
"అమెరికన్-ఆఫ్రికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మరణించిన తర్వాత 'నల్లవారి జీవితాలూ ముఖ్యమే' పేరిట ఉద్యమం నడుస్తోంది. దీంతో జాతి అనేది ఎన్నికల అంశంగా మారింది. దానికి మించి అమెరికా విలువలు, విధానాల ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించాలన్నది కూడా ప్రాధాన్యం పొందింది. అమెరికాలో ఇండియన్-అమెరికన్ ఓట్లు కేవలం 4.7 శాతమే. ఇది పెద్ద సంఖ్యేమీ కాదు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రబావం చూపే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలు చూపించే మొగ్గు ఆధారంగా విజయావకాశాలుంటాయి. పార్టీలకు విరాళాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఆధిపత్యం వహిస్తున్నారు. అందుకే, అన్ని పార్టీలకు మనోళ్లు ముఖ్యమైన ఓటర్లుగా మారారు."
-మీరా శంకర్, అమెరికాలో భారత మాజీ రాయబారి