కరీబియన్ ద్వీప దేశం హైతీలో భారీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 1,941కు చేరింది. మరో 7వేల మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో 84వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో ఆస్పత్రులు, పాఠశాలలు, వంతెనలు ఉన్నాయి. భూకంపం ధాటికి రోడ్లు పూర్తిగా పాడైపోవటం వల్ల క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లటం సవాల్‌గా మారింది.
హైతీలోని భారీ భూకంపం.. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపిందని.. ఐరాసకు చెందిన చిన్నారుల విభాగం యూనిసెఫ్ సంస్థ వివరించింది. వీరిలో 5లక్షల 40వేల మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు తెలిపింది.
"భూకంపంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలకు నిత్యావసర సరకులను అందించేందుకు అంతరాయం ఏర్పడుతోంది. గాయపడ్డ వారి కోసం యూనిసెఫ్ ఇప్పటికే ఔషధాలు, వైద్యపరికరాలతో పాటు నిత్యావసర సరకులను పంపించింది. ప్రజల అవసరాలు తీర్చేందుకు 15 మిలియన్ డాలర్లు అవసరం."
- యూనిసెఫ్