అమెరికాలో కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతోంది. మంటల తాకిడికి ఇప్పటివరకు 31 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పలువురి ఆచూకీ గల్లంతయింది. ఒరెగాన్లో 8 మంది చనిపోయారు. వాషింగ్టన్లో ఓ ఏడాది చిన్నారి మంటల్లో చిక్కుకొని మరణించింది. కాలిఫోర్నియాలో 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. తగిన సమయంలో అధికారులు హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతాల్లో మూగజీవులు ఎటూవెళ్లలేక మంటల్లో చిక్కుకొని చనిపోతున్నాయి. మరోవైపు కార్చిచ్చును అదుపు చేయడానికి 16 వేలమందికిపైగాఅగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30 లక్షల ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం దహనమైంది. 4 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయి.