కరోనా మహమ్మారి రోజుకో అవతారం ఎత్తుతూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వైరస్ వేరియంట్లపై ఎంత మేరకు పని చేస్తున్నాయనేదానిపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ స్పైక్ ప్రోటిన్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసి బీటా వేరియంట్‌పై ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రమేనని తేల్చారు.
తాజా అధ్యయనం జూన్ 24న జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైంది. క్రైయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా.. చైనాలో 2019లో తొలిసారి వెలుగు చూసిన వైరస్ స్పైక్ ప్రోటీన్‌ను.. బీటా, ఆల్ఫా వేరియంట్లతో పోల్చి చూశారు.. అమెరికాలోని బోస్టన్ చిల్డ్రెన్స్ ఆసుపత్రి పరిశోధకులు. B.1.351(బీటా)వేరియంట్ మ్యుటేషన్లలో స్పైక్ పలు సందర్భాల్లో తన ఆకృతిని మార్చుకుంటున్నట్లు గుర్తించారు. దాంతో.. ప్రస్తుత వ్యాక్సిన్లతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు బీటా వైరస్‌ను మట్టుబెట్టలేకపోతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.
" వైరస్ మ్యూటేషన్లు.. వ్యాక్సిన్లతో ప్రేరేపితమయ్యే యాంటీబాడీలు ప్రభావం చూపకుండా చేస్తాయి. బీటా వేరియంట్‌కు కొంత మేర ప్రస్తుత వ్యాక్సిన్లను తట్టుకునే శక్తి ఉంది. ఈ వేరియంట్ నుంచి రక్షించడానికి కొత్త జన్యు శ్రేణితో ఉన్న బూస్టర్ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాం. "