సిగార్.. చూడటానికి చుట్టలాగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే క్యూబాలో విప్లవాన్ని రగిలించిన చెగువేరా, ఫిడెల్ కాస్ట్రోలు గుర్తుకొస్తారు. సిగార్ ఆ దేశ ప్రజలకు ఎంతో ప్రియమైనది. అక్కడ ఉత్పత్తి అయ్యే సిగార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొగాకు అభిమానుల కోసం క్యూబా రాజధాని హవానాలో అతి పెద్ద సిగార్ల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన.. ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది.
22వ హెబనాస్ ఫెస్టివల్‌గా పిలిచే ఈ కార్యక్రమంలో.. ప్రఖ్యాతి గాంచిన సిగార్ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. రోమియో వై జూలియటా, మాంటెక్రిస్టో, బోలివర్ వంటి అరుదైన సిగార్ బ్రాండ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి.
అలాగే పార్టగాస్ బ్రాండ్ 175వ వార్షికోత్సవ సందర్భంగా.. ప్రత్యేక సిగార్లను ప్రదర్శించింది ఆ కంపెనీ. సిగార్ బ్రాండ్స్‌లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన హెబనాస్.. ఈ ఏడాది రెండు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానుంది.