తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2020, 10:37 AM IST

ETV Bharat / international

కొవిడ్‌పై పోరుకు ఆవు యాంటీబాడీలు!

ప్రపంచంపై పంజా విసురుతూ లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది కరోనా. వ్యాక్సిన్​పై పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారిని అంతమొందించేందుకు ఆవుల్లోని యాంటీబాడీలు సాయపడుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.

Cow antibodies to fight Kovid
కొవిడ్‌పై పోరుకు ఆవు యాంటీబాడీలు!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ఆవుల్లో ఉత్పత్తయిన యాంటీబాడీలు దోహదపడగలవని అంటున్నారు శాస్త్రవేత్తలు. జన్యు మార్పిడి విధానంలో గోవుల్లో తయారుచేసే ఈ యాంటీబాడీలను మానవుల్లో ప్రవేశపెడితే కరోనా నిర్మూలన సాధ్యమేనని వారు చెబుతున్నారు.

సాధారణంగా గోవులను యాంటీబాడీ కర్మాగారాలుగా అభివర్ణిస్తుంటారు. మనుషులతో పోలిస్తే వాటి రక్తంలో ప్రతి మిల్లీలీటరుకు దాదాపు రెట్టింపు స్థాయిలో యాంటీబాడీలు ఉంటాయి. తాజా పరిశోధనల్లో భాగంగా అమెరికాలోని సౌత్‌ డకోటాకు చెందిన సాబ్‌ బయోథెరపాటిక్స్‌ కంపెనీ శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌పై ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ను గోవుల్లో ప్రవేశపెట్టారు. దీంతో వాటిలో అధిక సంఖ్యలో శక్తిమంతమయిన పాలీక్లోనల్‌ యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి.

" పాలీక్లోనల్‌ యాంటీబాడీలు వైరస్‌కు చెందిన అనేక భాగాలను గుర్తించగలవు. వాటికి అతుక్కొని అంతం చేయగలవు. ప్రస్తుతం చాలా కంపెనీలు కరోనాపై పోరాటానికి మోనోక్లోనల్‌ యాంటీబాడీలను తయారుచేస్తున్నాయి. అవి వైరస్‌కు చెందిన నిర్దిష్ట భాగాన్ని మాత్రమే గుర్తించగలవు. ఉత్పరివర్తనాలతో కరోనా తన రూపాన్ని కాస్త మార్చుకున్నా 'మోనోక్లోనల్‌'తో లాభముండదు. పాలీక్లోనల్‌ యాంటీబాడీలు వాటికంటే చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఒక ఆవు ఒక్క నెలలో ఉత్పత్తి చేసే యాంటీబాడీలతో వందల మంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించవచ్చు"

- శాస్త్రవేత్తలు

రెండు నెలల్లో పాలీక్లోనల్‌ యాంటీబాడీలపై క్లినికల్‌ ప్రయోగాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు పరిశోధకులు.

ABOUT THE AUTHOR

...view details