కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది అమెరికాలోని రోగ నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ). అగ్రరాజ్యంలోని అత్యధిక జనాభాకు.. వచ్చే ఏడాది మధ్యకాలం వరకు వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి రాకపోవచ్చని తెలిపింది. కాంగ్రెస్‌కు సమర్పించిన 57పేజీల నివేదికలో ఈ విషయాన్ని వివరించింది.
"వ్యాక్సిన్ భద్రత, సమర్థతపై ఉన్న ప్రశ్నలు తొలిగిపోతే.. అమెరికన్లకు టీకాను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రచిస్తోంది. అయితే వచ్చే ఏడాది మధ్య వరకు దేశంలోని అత్యధిక జనాభాకు టీకా అందే అవకాశాలు లేవు."
--- డా. రాబర్ట్ రెడ్‌ఫీల్డ్, సీడీసీ డైరక్టర్.
అయితే.. వ్యాక్సిన్‌పై అనేకమందిలో సందేహాలు నెలకొన్నట్టు కనపడుతున్నాయి. వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. దానిని తీసుకోవడంపై 50శాతం మంది ప్రజలు విముఖంగా ఉన్నట్టు ఓ సర్వే పేర్కొంది.
మరోవైపు.. ఈ ఏడాదిలో వ్యాక్సిన్ విడుదలైతే.. దాని సరఫరా చాలా తక్కువగా ఉండే అవకాశముందని రెడ్‌ఫీల్డ్ తెలిపారు. అందుకని.. మాస్కులు ధరించాలని, వాటి వల్ల చాలా ఉపయోగం ఉందని స్పష్టం చేశారు.
అయితే ఈ ఏడాది చివర లేదా జనవరి 2021లో వ్యాక్సిన్ ప్రజా వినియోగానికి అందుబాటులోకి వస్తుందని అమెరికా అరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:-'టీకా కోసం 2021 ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే'