కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాత్రి- పగలు తేడా లేకుండా తమ మేథోసంపత్తిని వ్యాక్సిన్‌ను రూపొందించడం కోసం నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి.. ప్రజలకు అందించినప్పటికీ ఎలాంటి లాభం లేదని ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. వైరస్ మరికొన్నేళ్లు ఇలాగే ఉంటుందని పేర్కొంది. హెచ్ఐవీ, మీసిల్స్, చికెన్ పాక్స్ లాగే భూమిపై ఉండిపోవచ్చని వెల్లడించింది.
కరోనాతో సహజీవనం చేయకతప్పదన్న విషయాన్ని అమెరికా గుర్తించి.. వైరస్‌పై పోరుకు ప్రణాళికలు రచించాలని అగ్రరాజ్యానికి చెందిన ఎపిడమాలజీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నో అనిశ్చితులున్నప్పటికీ.. కరోనాతో కలిసి జీవించడం మాత్రం స్పష్టంగా కనపడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి వైరస్ సోకలేదని, వారందరూ ప్రమాదంలో ఉన్నట్లేనని వెల్లడించారు.
'వైరస్ ఉండటానికే ఇక్కడకి వచ్చింది. కానీ దానితో సహజీవనం చేస్తూ మనం భద్రంగా ఉండటం ఎలాగా అనేదే అసలైన ప్రశ్న' అని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎపిడమాలజిస్ట్ సారా కోబే అభిప్రాయపడ్డారు.
అయితే కరోనా వైరస్ ప్రతాపం తగ్గుముఖం పట్టొచ్చని పలువురు నిపుణులు విశ్వసిస్తున్నారు. మనిషి రోగ నిరోధక శక్తి.. వైరస్‌కు అలవాటు పడుతుందన్నారు. కానీ దీనికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు.