1918-19లో వచ్చిన స్పానిష్ ఫ్లూ (Spanish Flu) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయిలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పరిచిన మహమ్మారి కరోనానే అని శాస్త్రవేత్తలు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే అగ్రరాజ్యంపై మాత్రం స్పానిష్ ఫ్లూతో సమానంగా కరోనా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలో కొవిడ్ కారణంగా నమోదైన మరణాల (us covid deaths) సంఖ్య.. అప్పట్లో వచ్చిన స్పానిష్ ఫ్లూకు (us spanish flu deaths) దాదాపు సమానంగా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ల పంపిణీలో జాప్యం జరగడమే ఈ పరిస్థితులకు కారణమని తెలిపారు.
మరో లక్ష మరణాలు..
డెల్టా వేరియంట్ వ్యాప్తి (america delta variant) తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశంలో రోజుకు సగటున 1,900 మంది ప్రాణాలు కోల్పోతున్నారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. సోమవారం నాటికి దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 6,75,000కి చేరినట్లు పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేశారు.
శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో కొవిడ్ కేసులు మరింత పెరుగుతాయని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి దేశంలో మరో లక్ష మరణాలు నమోదవుతాయని పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,76,000కి చేరనుంది.