Covid death risk: స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలు వచ్చినవారితో పోలిస్తే.. తీవ్రస్థాయి కొవిడ్ నుంచి కోలుకున్నవారికి ఏడాదిలోగా మరణించే ముప్పు రెండింతలు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది! కొవిడ్-19 తీవ్రస్థాయి బాధితుల్లో 20% మంది శ్వాసవ్యవస్థ దెబ్బతిని, రక్తనాళాలు చిట్లిన కారణంగా మృత్యువాత పడినట్టు పేర్కొన్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ఫ్రాంటీర్స్ ఇన్ మెడిసిన్ పత్రిక అందించింది.
Severe covid survivors: పరిశోధనకర్త ఆర్చ్ మెయినస్ నేతృత్వంలోని బృందం... కొవిడ్ పరీక్షలు చేయించుకున్న మొత్తం 13,638 మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించింది. వీరిలో 178 మందికి తీవ్రస్థాయి, 246 మందికి మధ్యస్థాయి కొవిడ్ లక్షణాలు కనిపించాయి. మిగతావారికి నెగెటివ్ ఫలితమే వచ్చింది. మహమ్మారి సోకినవారిని పరిశోధకులు 12 నెలలపాటు పరిశీలిస్తూ వచ్చారు.
"కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యంపాలైన వ్యక్తులు 6 నెలల్లోనే మళ్లీ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది. కోలుకున్నాక 12 నెలల్లో వారు మరణించే ముప్పు అధికంగా ఉంటున్నట్టు గుర్తించాం. 65 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే, అంతకంటే తక్కువ వయసు ఉన్నవారికే ఈ ప్రమాదం ఎక్కువ. వీరిలో 80% కొవిడ్ ఇబ్బందుల కారణంగా కాకుండా, ఇతరత్రా సమస్యల వల్లే మృతిచెందుతున్నారు."