కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు (covid antibodies in breastmilk) వైరస్ నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయని అంతర్జాతీయ అధ్యయనాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ఇదే సమయంలో బాలింతల్లో ఈ యాంటీబాడీల స్థాయిలు ఎలా ఉంటాయనే విషయంపైనా నిపుణులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కొవిడ్ ఇన్‌ఫెక్షన్ బారినపడిన లేదా వ్యాక్సిన్ తీసుకున్న తల్లి పాలలోనూ క్రియాశీల కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, ఈ యాండీబాడీలు వైరస్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాజా అధ్యయనం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
77 మంది బాలింతలపై పరిశోధన..
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ బారినపడిన లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా 77మంది బాలింతల నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 47మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారు కాగా వ్యాక్సిన్ గ్రూపునకు చెందిన 30 మంది మహిళల నుంచి నమూనాలు తీసుకున్నారు. వీరిలో ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న తల్లుల్లో వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యునోగ్లోబులిన్ ఎ యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న తల్లుల్లోనూ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు విధాల్లో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కొవిడ్-19ను తటస్థీకరిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.