భారత్‌లో తొలిసారి గుర్తించిన కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు అమెరికాలో వెలుగు చూశాయి. లూసియానాలోని ఓ వైద్య కేంద్రంలో ఈ వేరియంట్లకు సంబంధించిన రెండు కేసులను గుర్తించారు. ఈ వైరస్ రకం వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు భావిస్తున్నందున.. దీన్ని డబ్ల్యూహెచ్ఓ, బ్రిటన్ ఆందోళనకరమైన వైరస్ రకంగా ప్రకటించాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ(ఎల్‌ఎస్‌యూ) ఆరోగ్య విభాగం పేర్కొంది.
2,600కుపైగా నమూనాల జన్యుక్రమాలను తాము పరీక్షించగా రెండు కేసులు వెలుగు చూశాయని ఎల్‌ఎస్‌యూ తెలిపింది. లూసియానాలో నిర్వహించిన మొత్తం జన్యుక్రమాల పరిశీలనల్లో 56 శాతం తమ ల్యాబ్‌లోనే జరిగాయని చెప్పింది. ఇప్పటివరకు తాము 3,31,000 నమూనాలను పరీక్షించగా.. 7,600 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని చెప్పారు.