చైనాపై ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని అమెరికా ప్రతినిధుల సభలో 9 మంది కీలక సెనేటర్లు ఓ బిల్లును ప్రవేశపెట్టారు. కరోనా విపత్తుకు సంబంధించి చైనా జవాబుదారీగా వ్యవహరించకపోతే ఈ చర్యలు తీసుకునేలా 'ద కొవిడ్-19 అకౌంటబిలిటీ' ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని లిండ్సే గ్రహమ్ నేతృత్వంలోని ఈ సెనేటర్ల బృందం కోరింది.
"చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రమేయం లేకుండా అమెరికాకు వైరస్ వచ్చి ఉండేది కాదు. వుహాన్ ల్యాబ్లో దర్యాప్తు చేసేందుకు అంతర్జాతీయ సమాజానికి చైనా అనుమతి ఇవ్వటం లేదు. ఈ వైరస్ వ్యాప్తి ఎలా మొదలైందన్న విషయాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులనూ రానివ్వటం లేదు. ఇటువంటి చర్యలు తీసుకోకుండా చైనా మాట వినదు. విచారణకు అంగీకరించే వరకు ఈ కఠిన ఆంక్షలు చైనాను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి."
- లిండ్సే గ్రహమ్, అమెరికా సెనేటర్
కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరించటంపై చైనా కమ్యూనిస్టు పార్టీ బాధ్యత వహించాలని లిండ్సే డిమాండ్ చేశారు. వెట్ మార్కెట్ల వల్ల అనేక రకాల అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని.. వాటిని మూసివేయాల్సిందేనని ఆయన అన్నారు.