ప్రపంచ పెద్దన్నగా పరిగణించే అమెరికా.. కరోనా మహమ్మారి ధాటికి అతలాకుతలమవుతోంది. వైరస్ కేసులు, మృతుల జాబితాలో అగ్రరాజ్యం మొదటిస్థానంలో ఉందంటేనే.. అక్కడ కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మొత్తం కేసులు 20 లక్షలు దాటగా అందులో సింహభాగం.. 6 లక్షలకు పైగా అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షా 26వేలకు పైగా కరోనా మరణాలు నమోదవగా.. ఒక్క యూఎస్‌లోనే 26వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనా ప్రభావంతో మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 2,129 మంది మరణించారు. ఈనెల 10న అత్యధికంగా ఒకేరోజు 2,074 మంది మృత్యువాతపడగా, ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసింది.
ప్రపంచదేశాలకు అమెరికా కరోనా కేంద్ర బిందువుగా మారితే.. యూఎస్‌లో కరోనా కేంద్ర బిందువుగా తయారైంది న్యూయార్క్ నగరం. దేశంలోని మొత్తం కేసుల్లో ఒక్క న్యూయార్క్‌లోనే 2 లక్షలకుపైగా నమోదయ్యాయి. మృతుల్లోనూ 10,800 మందికి పైగా ఈ నగరంలోనే మరణించడం గమనార్హం. అయితే వీరిలో 6,589 మంది కరోనాతో మృతి చెందినట్లు నిర్ధరణ అవగా.. 3,778 మంది వైరస్ పరీక్షలు నిర్వహించడానికి ముందే మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఈ 3,778 మంది వైరస్ సోకి మరణించినట్లుగా భావిస్తున్నారు. ఫలితంగా నగరంలో కొవిడ్-19 మృతుల సంఖ్య 10వేలు దాటింది.
'చీకట్లు దాటి వెలుగు రేఖలు చూస్తాం'
కంటికి కనిపించని కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో పురోగతి సాధిస్తున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా చీకట్లను దాటి వెలుగు రేఖలను చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే వదిలేస్తున్నట్లు తెలిపారు ట్రంప్. ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో మే 1 కంటే ముందే.. పూర్తి ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
జాతి ప్రాతిపదికన లెక్కించండి