గతంలో వచ్చిన కరోనా వైరస్ల వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీల వల్ల కూడా ఉపయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్-19 సోకిన వారికి వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వ్యాధి లక్షణాల తీవ్రతలో వైరుధ్యాలకు కారణాలను కొంత మేర ఇవి వెల్లడి చేస్తున్నాయని చెప్పారు. అమెరికాలోని 'ట్రాన్స్లేషనల్ జీనోమిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్'(టిజెన్) శాస్త్రవేత్తలు ఆ పరిశోధన చేపట్టారు.
యాంటీబాడీ స్పందన..
తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు 'పెప్సీక్' అనే వినూత్న సాధనాన్ని ఉపయోగించారు. దీని సాయంతో.. మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే అన్ని రకాల కరోనా వైరస్లకు మానవ యాంటీబాడీలు ఎలా స్పందిస్తాయన్నది పరిశీలించారు. తద్వారా మునుపటి కరోనా వైరస్లకు గురైనవారిలోని యాంటీబాడీ స్పందనను.. తాజా సార్స్-కోవ్-2తో ఇన్ఫెక్షన్ బాధితుల్లోని స్పందనతో పోల్చి చూశారు.