అమెరికా కకావికలం- లక్షా 50 వేలు దాటిన మరణాలు - కొవిడ్-19 కేసులు
ప్రపంచాన్ని ఆవహించిన కరోనా కారుమబ్బులు విధ్వంసానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు 6.56 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న మహమ్మారి.. పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటి 66 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. అమెరికాలో మహమ్మారి మృతుల సంఖ్య లక్షా యాభై వేలు దాటింది.
అమెరికా కకావికలం- లక్షా 50 వేలు దాటిన మరణాలు
By
Published : Jul 28, 2020, 8:40 AM IST
కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 2.17 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య కోటి 66 లక్షలకు పెరిగింది. మరో 4,198 మంది మరణించగా.. ఇప్పటివరకు 6.56 లక్షల మంది విధ్వంసకరమైన మహమ్మారి ధాటికి బలయ్యారు.
అమెరికా..
అగ్రరాజ్యం కరోనాతో కుదేలవుతోంది. మరణాల సంఖ్య లక్షా యాభైవేలు దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో 61 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 596 మంది మరణించారు. మొత్తం కేసులు 44 లక్షలు మించిపోయింది.
బ్రెజిల్..
మరో 23 వేల కేసులతో బ్రెజిల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. బాధితుల సంఖ్య 24.43 లక్షలకు ఎగబాకింది. మరో 627 మంది కరోనాకు బలికాగా.. మొత్తం మరణాల సంఖ్య 87,679కి చేరింది.
మెక్సికో..
కరోనా కారణంగా మెక్సికోలో 306 మంది మరణించారు. కొత్తగా 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. మొత్తం మరణాల సంఖ్య 43,680గా ఉంది.
దక్షిణాఫ్రికా..
దక్షిణాఫ్రికాలో కరోనా విధ్వంసం భీకరంగా సాగుతోంది. 298 మంది మరణించగా.. కొత్తగా 7,096 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 4.52 లక్షలకు పెరగ్గా.. మరణాల సంఖ్య 7,067కి చేరింది.
కొలంబియా..
కరోనాతో కొలంబియా అతలాకుతలమవుతోంది. దేశంలో 8 వేలకు పైగా కేసులు గుర్తించారు. మొత్తం బాధితుల సంఖ్య 2.57 లక్షలకు ఎగబాకింది. 252 మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 8,777కి పెరిగింది.
యునైటెడ్ కింగ్డమ్..
యూకేలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. తాజాగా 685 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. మరో ఏడుగురి మరణంతో మొత్తం మృతుల సంఖ్య 45,759కి చేరింది.