కరోనా మహమ్మారి కారణంగా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయని ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతుంటే అమెరికా పరిశోధకులు మరో భయానక విషయాన్ని వెల్లడించారు. కొవిడ్ సోకిన రోగుల్లో మొత్తం నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం అన్నల్స్ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.
అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. కొవిడ్ సోకిన సగానికి పైగా రోగుల్లో తలనొప్పి, మైకం, అప్రమత్తత తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం, వాసన, రుచి తెలియకపోవడం, మూర్చ వంటి లక్షణాలు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బలహీనతతో పాటు కండరాల నొప్పుల వంటి లక్షణాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
ముందుగానే...
జ్వరం, దగ్గు వంటి కరోనా వ్యాధి లక్షణాలు బయటపడక ముందే నాడీ వ్యవస్థపై సార్స్-కొవ్-2 ప్రభావం చూపే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ప్రజలు, వైద్యులు దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కారణంగా రోగుల్లో సంభవించే వివిధ రకాల నాడీ వ్యవస్థ పరిస్థితుల గురించి పరిశోధనలో పాల్గొన్న ఇగోర్ కోరాల్నిక్ వివరించారు. ఈ విషయంపై వైద్యులకు అవగాహన చాలా ముఖ్యమన్నారు కోరాల్నిక్. కొవిడ్-19 భిన్న రకాలుగా నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేయగలదని చెప్పారు. మెదడు, వెన్నెముక, నరాలు, కండరాలు వైరస్ కారణంగా ప్రభావితం అవుతాయని వెల్లడించారు.
కరోనా రోగుల్లో మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థలోని అనేక భాగాలను కలిపే మెనింజెస్, పుర్రెకు షాక్ అబ్జార్బర్‌గా పనిచేసే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సిఎస్‌ఎఫ్)లను ప్రత్యక్షంగా ప్రభావితం చేయగలదని తేలింది. వ్యాధి కారణంగా రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన వల్ల మెదడు, నరాలు తాపానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.
అయితే వైరస్ కారణంగా తలెత్తుతున్న ఈ సమస్యలు తాత్కాలికమా లేక శాశ్వతమా అనే విషయాన్ని నిర్ధరించేందుకు రోగులను దీర్ఘకాలం పాటు పరిశీలించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.