కరోనా వ్యాపించకుండా ఎన్-95 మాస్కులు సమర్థంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు కూడా తమ రక్షణ కోసం ఎన్-95 మాస్కులకే ప్రాధాన్యం ఇస్తారు.
అయితే, వీటిని ఒకేసారి వినియోగించే అవకాశం ఉంది. కానీ, పూర్తిగా శుభ్రం చేశాక మరోసారి వాడొచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇలా అదనంగా 3 సార్లు వినియోగించవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు.
కొరత తగ్గించేందుకు..
ఈ విషయానికి సంబంధించిన అధ్యయన ఫలితాలను 'ఎమర్జింగ్ ఇన్పెక్షియస్ డిసీజెస్' అనే జర్నల్లో ప్రచురించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మాస్కుల కొరత పెరుగుతున్న కారణంగా శుభ్రం చేసే పద్ధతులపై దృష్టి సారించాల్సి వస్తోందని తెలిపారు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆవిరితో..
అధ్యయనంలో భాగంగా వివిధ పద్ధతుల్లో మాస్కులను శుభ్రం చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆవిరి, అతినీలలోహిత కిరణాలు, 70 డిగ్రీల వరకు వేడి చేయటం, 70శాతం ఇథనాల్.. ఈ పద్ధతుల్లో శానిటైజ్ చేశామన్నారు. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ మంచి ఫలితాలను ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి నియంత్రణలో ఎన్95 భేష్!'