అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్.. క్లుప్తంగా చెప్పాలంటే ఓసీడీ. ఇలా చెబితే చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ మహానుభావుడు చిత్రం గుర్తుందా? కథానాయకుడు శానిటైజర్‌తో ఎప్పుడూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. అన్నీ సక్రమంగా ఉండాలంటాడు. ఈ అతిశుభ్రతా ధోరణికి ఓసీడీ అని పేరుపెట్టింది వైద్య శాస్త్రం. ఇదో మానసిక రుగ్మత అని తేల్చింది. సాధారణంగానే అతిశుభ్రతను పాటించే ఈ రుగ్మత ఉన్నవాళ్లకు ప్రస్తుత కరోనా కాలంలో కాస్త కష్టమే. వారిలోని అతి భయాలను సంతృప్తి పరిచేందుకు నేటి రోజుల్లో వారు పడే పాట్లు.. వాటికి పరిష్కారాలపై ఓ లుక్కేద్దాం.
కొంతమందిలోనే ఓసీడీ పెరుగుదల..
ఓసీడీ ఉన్నవాళ్లు సాధారణంగానే అతిశుభ్రతను పాటిస్తారు. నేటి కరోనా కాలంలో శుభ్రతను పాటించేందుకు వీరు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైరస్ సమయంలో ఓసీడీ కలిగినవారి మానసిక స్థితిపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు మెక్లీన్ ఓసీడీ ఇన్సిటిట్యూట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ నతానియేల్ వాన్క్రిక్.
ప్రస్తుత పరిస్థితి కొంతమందిలో ఓసీడీని తీవ్రం చేస్తుందని వివరించారు వాన్క్రిక్. కొద్దిగా అనారోగ్యంగా ఉండటం.. ఇతరులకు ముప్పుగా పరిణమించకూడదనే భావన.. ఓసీడీ ఉన్నవారిలో శుభ్రత ఆలోచనల్ని మరింత పెంచుతుందని తెలిపారు వాన్క్రిక్.
అయితే ఓసీడీ ఉన్న మరికొంతమంది రోగులు తమలో కొవిడ్-19 భయాలు లేదని చెప్పారని పేర్కొన్నారు వాన్క్రిక్. వారిని భయపెట్టే అంశాల్లో వైరస్ లేదని.. వారికున్న ఇతర భయాలతో పోల్చితే దీని స్థాయి తక్కువని వెల్లడించారు.
కరోనా భయాలతో ఇబ్బందులు..
ఓసీడీతో బాధపడే వారిలో కరోనా భయాలుంటే మాత్రం వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వాన్క్రిక్ పరిశోధన తేల్చింది. చేతులు కడుక్కోవడం వల్ల వైరస్‌ను ఎదుర్కోవచ్చనే మార్గదర్శకాలతో శుభ్రతలో మరింత అతి చేస్తారని వెల్లడించింది. చేతులు శుభ్రంగా ఉంచుకునే విషయంలో సీడీసీ వంటి సంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఓసీడీతో ఉన్నవారు అతి శుభ్రతను.. మరింత జాగ్రత్తగా పాటిస్తారని వెల్లడించారు వాన్క్రిక్. అతి శుభ్రతతో ఇంకా సురక్షితంగా ఉండవచ్చని భావిస్తారని చెప్పారు. దీనికి కారణం వారిలో ఉన్న ఆందోళన, ఏం జరుగుతుందోనన్న భయాలేనని వివరించారు.
ఒకే సూచన అమలు సరికాదు..