Covid-19 surge update: అమెరికాలో కొవిడ్-19 మహమ్మారి పంజా విసురుతోంది. డెల్టాతో పాటు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో కొవిడ్ ఉద్ధృతి మళ్లీ మొదలైంది! ఈ క్రమంలో ఇండోర్ ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేసే అవకాశమున్నట్టు ప్రకటించారు గవర్నర్ కాథి హోచుల్. వ్యాపార సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో వ్యాక్సిన్ తప్పనిసరి చేసేంత వరకు మాస్క్ ఆవశ్యకమని స్పష్టం చేశారు.
కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి.. మాస్క్ తప్పనిసరి అన్న ఆదేశాలను అమలు చేయాలా వద్దా అన్న విషయం ఆధారపడి ఉంటుందని తెలిపారు హోచుల్. 2020, ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత 2021 జూన్‌లో టీకా తీసుకున్న వారికి మాస్క్ అవసరం లేదని తెలిపారు. తాజాగా కేసుల పెరుగుదల కనిపిస్తున్నందున సోమవారం(డిసెంబర్ 12) నుంచి జనవరి 15 వరకు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
దక్షిణ కొరియాలో..
South Korea coronavirus cases: దక్షిణ కొరియాపై కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా మూడోరోజు 7వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యంత దుర్భర పరిస్థితిగా ప్రభుత్వం పేర్కొంది. కేసులు పెరుగుతున్నా.. ఆంక్షల వైపు ప్రభుత్వం మొగ్గు చూపకపోవటంపై విమర్శలు ఎదురవుతున్నాయి. డెల్టా వేరియంట్ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో బూస్టర్ డోస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో.. మూడో డోస్ ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో.. కొవిడ్ వైరస్ అదుపులోకి రాకపోతే.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కిమ్ బూ క్యూమ్ తెలిపారు.
జపాన్‌లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు
Japan Omicron: జపాన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు చేరినట్లు తెలిపింది. గత నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ తొలినాళ్లలో దేశంలోకి వచ్చిన వారిలో 8 మందికి వైరస్ పాజిటివ్‌గా తెలినట్లు పేర్కొంది. అందులో జపాన్‌లో తొలి కేసు వచ్చిన నమీబియా దౌత్యవేత్త ప్రయాణించిన విమానంలోనే ఓ మహిళ, చిన్న పిల్లాడు.. నవంబర్ 28న వచ్చినట్లు చెప్పారు.
రోమానియాలో ప్రయాణ ఆంక్షలు
Romania Covid restrictions: ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో దేశంలోకి వస్తున్న విదేశీ ప్రయాణికులపై కొత్త ఆంక్షలు, ఐసోలేషన్ చర్యలను అమలులోకి తీసుకొచ్చింది రోమానియా. గత అక్టోబర్-నవంబర్ మధ్య దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారికి ఈ వైరస్ సోకింది. ఆ విమానాల్లో వచ్చిన వారిలో పలువురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని, జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రయాణ ఆంక్షలు శుక్రవారం(డిసెంబర్ 10) నుంచి జనవరి 8 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో ఆంక్షల పొడిగింపు..