"వుహాన్‌లోని ఓ మార్కెట్లో కరోనా వైరస్ పుట్టింది.. వైరస్‌ను చైనాకు అమెరికా సైనికులే తెచ్చారు. మహమ్మారిని ఓ పరిశోధన కేంద్రంలో చైనానే కృత్రిమంగా సృష్టించింది..." ఇవీ.. ఈ ప్రాణాంతక వైరస్‌పై ఉన్న ఊహాగానాలు.
చైనా కేంద్రబిందువుగా డిసెంబర్లో వెలుగు చూసిన వైరస్ పుట్టుకకు అసలైన కారణం ఇంకా తెలియకపోవడం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ప్రాణాంతక వైరస్‌ను కృత్రిమంగా సృష్టించలేమని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. ఇది ప్రకృతి సంబంధిత మార్పు వల్లే ఏర్పడిందని స్పష్టం చేసింది.
నేచర్ మెడిసిన్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. అందుబాటులో ఉన్న జినోమ్ సీక్వెన్స్(జన్యు క్రమం) డేటా ఆధారంగా.. సార్స్-సీఓవీ-2, సంబంధిత వైరస్‌లపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు.
ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. వైరస్‌ను ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టించగలం అన్న దానికి ఆధారాలు లభించలేదన్నారు.
"అందుబాటులో ఉన్న జినోమ్ సీక్వెన్స్ డేటాతో వైరస్ జాతులను పోల్చితే.. కచ్చితంగా ఇది సహజ ప్రక్రియ కారణంగానే ఏర్పడిందని మేం చెప్పగలం."
-- క్రిస్టియన్ ఆండర్సన్, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జర్నల్ సహ రచయిత
వైరస్‌ను చైనా అధికారులు వేగంగా గుర్తించారని, ఒకరి నుంచి ఒకరికి సోకడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కేసులు నమోదవుతున్నాయన్నారు.
స్పైక్ ప్రోటీన్స్‌కు సంబంధించిన జెనెటిక్ టెంప్లేట్స్పై పరిశోధన చేపట్టారు. వైరస్ వెలుపలి భాగంలో ఉండే ఈ జన్యు టెంప్లేట్లు.. మనిషి, జంతు కణాలను పట్టుకుని, లోపలకు చొచ్చుకుపోయే విధంగా ఉపయోగపడతాయి.
ఈ స్పైక్ ప్రోటీన్‌లోని రెండు ముఖ్య లక్షణాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది. అందులో ఒకటి రిసెప్టర్-బైండింగ్- డొమైన్(ఆర్బీడీ). ఆతిథ్య కణాలను గట్టిగా పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. రెండోది క్లీవేజ్ సైట్. వైరస్‌కు ఇది.. ఆతిథ్య కణాలను చీల్చి లోపలకు ప్రవేశించే శక్తినిస్తుంది.
గబ్బిలం నుంచే...!
పరిశోధనను దృష్టిలో పెట్టుకుని.. వైరస్ మూలాలు ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వైరస్ మానవేతర జీవుల్లోకి తొలుత చొచ్చుకెళ్లి.. ఆ తర్వాత మనిషి కణాల్లోకి చేరి ఉండవచ్చు.