కరోనా మహమ్మారి వల్ల లక్షలాది మంది చిన్నారులు బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. గత 20 ఏళ్లుగా తగ్గుముఖం పడుతున్న బాల కార్మికులు కొవిడ్ కారణంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. ఈ మేరకు రెండు సంస్థలు కలిసి 'కొవిడ్-19: బాల కార్మికులు-సంక్షోభ సమయం, స్పందించాల్సిన సమయం' పేరిట నివేదిక విడుదల చేశాయి.
పేదరికం వల్లే..
2000 సంవత్సరం నుంచి 9.4 కోట్ల మేర బాల కార్మికులు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అయితే ఈ ఒరవడికి ప్రస్తుతం విఘాతం కలుగుతోందని పేర్కొంది. కరోనా వల్ల పేదరికం పెరిగిపోతోందని ఫలితంగా కుటుంబాలు మనుగడ సాగించేందుకు చిన్నారులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని నివేదిక వెల్లడించింది. కొన్ని దేశాల్లో ఒక శాతం పేదరికం పెరిగితే.. 0.7శాతం మేర బాల కార్మికులు పెరుగుతున్నారన్న అధ్యయనాల సారాంశాన్ని నివేదిక ప్రస్తావించింది.
"కుటుంబ ఆదాయాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినందున.. చాలా మంది తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. అందువల్ల సంక్షోభ సమయంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలి. విద్య, సామాజిక రక్షణ, న్యాయం అందించాలి."
-గయ్ రైడర్, అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్