కరోనా నుంచి వేగంగా కోలుకునే వారిలో.. యాంటీబాడీలు నెలల పాటు వృద్ధి చెందుతున్నట్లు అమెరికా బ్రిగమ్ ఆసుపత్రి పరిశోధకులు గుర్తించారు. వైరస్‌పై పోరులో రోగ నిరోధక శక్తి పాత్రకున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తుందని పేర్కొన్నారు. కరోనా టీకాను రూపొందించేందుకు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
లక్షణాలు కనపడకపోయినా
కరోనా సోకిన ఐదురోజుల్లోనే, లక్షణాలు బయటకు కనపడకపోయినా రాపిడ్ యాంటీజెన్ టెస్టులో తెలుస్తుందని దిల్లీలోని ఎయిమ్స్ పరిశోధకులు వెల్లడించారు. దీనివల్ల వెంటనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాపిడ్ యాంటీజెన్ టెస్టు 95.4 శాతం కచ్చితత్వంతో, వేగంగా కరోనా రిపోర్టును అందిస్తుందని వివరించారు. ఈ టెస్టులో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించవచ్చని, నెగటివ్ అయితే మరోసారి పరీక్ష చేసుకోవాలని సూచించారు.
కరోనాతో పాటు ఇతర సమస్యలు
ప్రతి ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరికి గ్యాస్ట్రోఇంటైస్టెనల్ సమస్యలు తలెత్తున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీరికి ఆకలి లేకపోవటం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితర సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు వైద్యులు.
ఆరుమీటర్ల దూరం:
దగ్గినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు దాదాపు ఆరు మీటర్ల దూరం ప్రయాణిస్తాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి సహాయంతో ఇవి పొడి వాతావరణంలోనూ ప్రయాణిస్తాయని తేలింది. వాతావరణ పరిస్థితులు, గాలివేగం, ఉష్ణోగ్రతల వల్ల తుంపర్లు ప్రయాణించే దూరం ఆధారపడి ఉంటుందని అధ్యయనం పేర్కొంది. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం వల్ల ఇలాంటి తుంపర్ల నుంచి బయటపడవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
అధిక ప్రభావం
కరోనాతో మరణించినవారి శరీర భాగాలపై లండన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. కరోనా ప్రభావం ఊపిరితిత్తుల్లోని కణాలపై అధికంగా ఉందని తెలిపారు. దీని వల్ల బాధితులు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారి త్వరగా మరణిస్తున్నారని పేర్కొన్నారు. 41 మంది మృతుల కీలక అవయవాలపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.