కరోనాలో(Corona virus) కొత్తగా వస్తున్న రకాలు గాలి ద్వారా సంక్రమించేలా క్రమంగా రూపాంతరం చెందుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌లోని ఆల్ఫా వేరియంట్(Corona Delta variant) బారినపడిన వ్యక్తులు.. సాధారణ రకంతో పోలిస్తే 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరల్ రేణువులను గాల్లోకి వెదజల్లుతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖానికి సరిగా అమరని వస్త్ర, సర్జికల్ మాస్కుల వల్ల కొవిడ్-19 వ్యాప్తి సగం మేర మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఆల్ఫా రకం కన్నా డెల్టా వేరియంట్(Delta variant) మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలో పాల్గొన్న డాన్ మిల్టన్ పేర్కొన్నారు. 'కొత్త వేరియంట్లు క్రమంగా గాలిద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. అందువల్ల గదుల్లో వెంటిలేషన్ బాగుండాలి. ముఖానికి సరిగా అమరే మాస్కులు ధరించాలి. దీనికితోడు టీకాలను పొందితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు' అని ఆయన తెలిపారు.