కరోనా వైరస్ వేర్వేరు దేశాల్లో మరో 1,014 మందిని బలిగొంది. ఫలితంగా ఇప్పటివరకు ఆ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 14,685కి చేరింది. నేడు కొత్తగా 21, 350మందికి పైగా వైరస్ సోకింది. మొత్తంగా బాధితుల సంఖ్య 3,38,680కి చేరింది.
చైనా, ఇటలీ, అమెరికా, స్పెయిన్, జర్మనీ, ఇరాన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆయా దేశాల్లో వైరస్ సోకిన, మరణించిన వారి వివరాలు.
దేశం | బాధితులు | మరణాలు |
చైనా | 81,093 | 3270 |
ఇటలీ | 59, 138 | 5476 |
అమెరికా | 34, 673 | 450 |
స్పెయిన్ | 28, 768 | 1772 |
జర్మనీ | 24, 873 | 94 |
ఇరాన్ | 21, 638 | 1685 |
ఫ్రాన్స్ | 16, 018 | 674 |
దక్షిణ కొరియా | 8,961 | 111 |
స్విట్జర్లాండ్ | 7474 | 98 |
బ్రిటన్ | 5683 | 281 |
వైరస్ సోకిన తమ పౌరుల్లో 96 వేల మందికి వ్యాధి నయమైనట్లు చైనా ప్రకటించింది.
బయటకొస్తే 5వేల యూరోల ఫైన్..
వైరస్ ప్రభావిత దేశాల్లో రెండో స్థానంలో ఉన్న ఇటలీ వ్యాధి నియంత్రణ కోసం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాంబోర్డీ ప్రాంతంలో వ్యక్తిగత వాహనాలతో బయట తిరగడంపై ఆంక్షలు విధించింది. ఇంటికి 200 మీటర్ల దూరం వరకే పెంపుడు శునకాలను వాకింగ్‌కు తీసుకెళ్లాలని పరిమితి విధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే 5వేల యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.