కరోనా వైరస్ పనిపట్టడం, ఆర్థిక స్థిరత్వం, జాతి సమానత్వం, వాతావరణ మార్పులపైనే జో బైడెన్, కమలా హారిస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనుందని వారి బృందం పేర్కొంది. అమెరికాను తిరిగి గాడిలో పెట్టడమే వారి తొలి ప్రాధాన్యమని అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
"అమెరికాను పునర్నిర్మించడమే మా తొలి ప్రాధాన్యం. ఇంతకుముందెన్నడూ లేని అమెరికాను నిర్మిస్తాం. మా ప్రాధాన్యాల ప్రకారం తొలి రోజు నుంచే పని మొదలుపెడతాం. ప్రమాణస్వీకారం చేయగానే కరోనా మహమ్మారిపై బైడెన్ సమరసంఖం పూరిస్తారు."
- బైడెన్-హారిస్ బృందం
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం నుంచి అధికార మార్పిడిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బైడెన్ బృందం యోచిస్తోంది.
మహమ్మారిపై పోరాటం...
కరోనా మహమ్మారితో పోరాటంలో అలసిపోయిన ప్రజల్లో నూతనోత్తేజం తీసుకువచ్చి పరిస్థితులను చక్కబెట్టడానికి సరైన ప్రభుత్వం కావాలని అమెరికన్లు బైడెన్‌ను ఎన్నుకున్నట్లు ఈ బృందం తెలిపింది. చిన్న వ్యాపారులు, మధ్యతరగతిని ఆదుకునేలా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజారోగ్యంపై ఎప్పటికప్పుడు నిపుణులు, శాస్త్రవేత్తలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. విశ్వాసం, పారదర్శకత, జవాబుదారీతనంతో బైడెన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపింది.
ఆర్థిక పునరుద్ధరణ...
కొవిడ్‌తో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నింపడం బైడెన్ ప్రభుత్వం తదుపరి లక్ష్యమని వారి బృందం పేర్కొంది. సరైన జీతాలతో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన, కార్మికుల ఐక్యత, అమెరికన్ కుటుంబాల ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలపై తమ సర్కార్ ఎక్కువ దృష్టి పెట్టనుందని వివరించింది.
"వాస్తవిక ప్రణాళికతోనే మహమ్మారిని అరికట్టగలం. ప్రజారోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కేవరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కష్టం. కట్టుదిట్టమైన ప్రణాళికతో మహమ్మారిని నిలువరిస్తాం. అనంతరం ఆర్థిక రథచక్రాలు తిరిగి పరుగులు పెట్టేలా చేస్తాం. ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వం రెండూ బైడెన్‌కు ముఖ్యమే."
- బైడెన్ బృందం
సమానత్వం...
ఆర్థిక అసమానతలపై పోరాటం, జాతి సమానత్వం, నల్ల జాతీయుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూడటం వంటివి బైడెన్ ప్రభుత్వ మూడో ప్రాధాన్యమని ఆయన బృందం స్పష్టం చేసింది. శ్వేతజాతీయులతో సమానంగా నల్లజాతీయులు, లాటినో, ఆసియా అమెరిన్లు అందరికీ అవకాశాలు వచ్చేలా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేయాలని బైడెన్ యోచిస్తున్నట్లు తెలిపింది.
వాతావారణ మార్పులు...
పర్యావరణ పరిరక్షణ బైడెన్ ప్రభుత్వం తదుపరి బాధ్యతని ఈ బృందం తెలిపింది.
"మిత్ర దేశాలు, శత్రుదేశాలు ఇలా ఎవరితో ఎలా వ్యవహరించాలో బైడెన్‌కు బాగా తెలుసు. పారిస్ ఒప్పందంలో అమెరికాను తిరిగి చేర్చడమే కాదు.. బైడెన్ అంతకుమించి చేస్తారు. ప్రతి దేశం వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడేలా బైడెన్ కృషి చేస్తారు."
- బైడెన్ బృందం