కరోనాతో బాధపడుతున్నవారికి జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులతో పాటు ఇతర అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది రుచి, వాసన చూసే శక్తి కోల్పోవటం. వైరస్ సోకినవారిలో 20 నుంచి 25 శాతం మంది రుచిని గుర్తించే సామర్థ్యం కోల్పోతున్నారని తాజా అధ్యయనం తెలిపింది.
అయితే కరోనా వైరస్ రుచిని గుర్తించే కణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఏసీఎస్ ఫార్మాకాలజీ అండ్ ట్రాన్స్లేషనల్ సైన్స్ అనే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. గతంలో జరిగిన పరిశోధనలకు పూర్తి భిన్నమైన ఫలితాలను ఇచ్చింది.
"వైరస్ సోకిన కొన్ని రోజులకు వ్యాధిగ్రస్తుల్లో కొంతమంది రుచి చూసే శక్తి కోల్పోతున్నారు. క్రమంగా వీరి రేటు పెరుగుతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సార్స్-కోవ్-2 వైరస్ రుచి మొగ్గలపై ప్రభావం చూపదు. కానీ, వైరస్ వల్ల మరణించిన మృతకణాల కారణంగా రుచిని గుర్తించే శక్తిని కోల్పోతూ ఉండొచ్చు."
- హాంగ్జియాంగ్ లియూ, జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకురాలు