కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ వైరస్ ను కట్టడి చేసే క్రమంలో చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా అవసరమైన వైద్య సదుపాయాలు అందకపోవటం వల్ల అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో సుమారు 47 మిలియన్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక మందులను వినియోగించలేకపోతున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఎఫ్పీఏ దాని భాగస్వామ్య సంస్థలు నివేదికను విడుదల చేశాయి. దీని కారణంగా రానున్న కొన్ని నెలల్లో అదనంగా సుమారు 7 మిలియన్ల మందిలో అవాంఛిత గర్భానికి దారి తీస్తుందని నివేదిక తెలిపింది.
అవెనిర్ హెల్త్, జాన్స్ హోప్ కిన్స్ విశ్వవిద్యాలయం (యూఎస్ ఏ), విక్టోరియల్ విశ్వవిద్యాలయం( ఆస్ట్రేలియా) సంయుక్తంగా డేటాను విడుదల చేశాయి. ఆయా దేశాలు మహిళలు, బాలికల భద్రత, హక్కులు, సంక్షేమం కోసం అత్యవసర చర్యలు చేపట్టకపోతే.. భవిష్యత్తు భయంకరంగా ఉండే అవకాశం ఉందని నివేదిక తేల్చింది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా.. కుటుంబ నియంత్రణ సౌకర్యం పొందలేకపోతున్నవారు అవాంఛిత గర్భాలకు గురవుతారు. గృహహింస, ఇతర హింసలకు గురయ్యే మహిళల సంఖ్య మిలియన్ల కొద్ది పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై కొవిడ్-19 విపత్తు ప్రభావం అధికంగా ఉండనుంది. స్త్రీ, పురుష అసమానతలు పెరిగిపోతాయి. మిలియన్ల మంది మహిళలు, బాలికలు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.