ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. అమెరికా, బ్రెజిల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో కొత్తగా లక్షకుపైగా కేసులు నమోదవ్వగా, బ్రెజిల్లో 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులేస్తున్నాయి ఆయా దేశాలు.
2022 చివరినాటికి 100 కోట్ల కొవిడ్ టీకా డోసులు అభివృద్ధి చేసేందుకు క్వాడ్ దేశాలు ప్రయత్నం చేస్తున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు అత్యవసరమున్న దేశాలకు వ్యాక్సిన్లు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం మీడియా ప్రతినిధి జెన్ సాకి తెలిపారు.
మరోవైపు.. 13 లక్షల ఆస్ట్రాజెనెకా డోసులను 'కొవాక్స్' వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం అందించనున్నట్లు జర్మనీ పేర్కొంది. అమెరికా సాయంతో ఈ డోసులు అందించనున్నట్లు స్పష్టం చేసింది.
రెడ్ లిస్ట్ నుంచి తొలగింపు!
కొవిడ్ నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ.. భారత్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చిన బ్రిటన్ మరో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8న రెడ్ లిస్ట్ నుంచి తొలగించి అంబెర్ లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు.. బ్రిటన్ వెళ్లేందుకు మూడు రోజుల ముందు కొవిడ్ టెస్టు చేయించుకోవాలని, ఇంగ్లాండ్ వెళ్లాక 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.
ఆయా దేశాల్లో కేసుల వివరాలు..
- అగ్రరాజ్యంలో వైరస్ కేసులు అమాంతం పెరిగాయి. కొత్తగా 1,12, 229 మంది వైరస్ బారిన పడ్డారు. 654 మంది మృతిచెందారు.
- బ్రెజిల్లో కొత్తగా 40,460 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,118 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో సుమారు 28వేల కేసులు నమోదు కాగా.. 53 మంది మృత్యువాత పడ్డారు.
- టర్కీలో కొత్తగా 26 వేల కేసులు వెలుగు చూశాయి. 122 మంది చనిపోయారు.
- ఇరాన్లో కొత్తగా 39వేల కేసులు వెలుగు చూశాయి. 409 మరణాలు నమోదయ్యాయి.
- ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 1,747 మంది వైరస్ ధాటికి చనిపోయారు. సుమారు 35 వేల కొత్తకేసులు నిర్ధరణ అయ్యాయి.
ఇదీ చదవండి:కరోనా దెబ్బకు ఆ నగరం బంద్- అధికారులకు శిక్షలు!