తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాపై కరోనా పంజా- ఒక్కరోజే 1.30లక్షల కేసులు

కొవిడ్​ మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్​ వ్యాప్తితో మళ్లీ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 1.30 లక్షల కేసులు వెలుగు చూశాయి. మెక్సికోలోని చాలా ప్రాంతాల్లో రెడ్​ అలర్ట్​ ప్రకటించారు. చైనాలో డెల్టా వ్యాప్తితో మళ్లీ ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం.

Covid-19 cases
అమెరికాపై కరోనా పంజా

By

Published : Aug 7, 2021, 9:51 AM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్​ వేగంగా చేపడుతున్న దేశాల్లోనూ కేసులు భారీగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో గత 3 రోజులుగా రోజువారీ కేసులు లక్షకుపైగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 1,30,706 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 750 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఫ్లోరిడా, టెక్సాస్​, కాలిఫోర్నియాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

'50 శాతం జనాభాకు వ్యాక్సినేషన్​ పూర్తి'

అమెరికాలో 50 శాతం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 8,21,000 డోసుల పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. 'గతవారం కొత్తగా వ్యాక్సిన్​ తీసుకున్న వారి సగటు 11 శాతానికి చేరుకుంది. అంతకు ముందు రెండు వారాల్లో 44శాతం పూర్తయింది. అన్ని వయస్సుల అమెరికన్లు 50శాతం మందికి వ్యాక్సినేషన్​ పూర్తయింది. అమెరికా ముందుకు సాగుతోంది' అని ట్వీట్​ చేశారు శ్వేతసౌధం కొవిడ్​-19 సమాచార డైరెక్టర్​ సైరస్​ షాహ్​పర్​. మరోవైపు.. రష్యా, చైనా వ్యాక్సిన్​ తీసుకున్న విదేశీ పర్యటకుల అనుమతిపై బైడెన్​ పరిపాలన విభాగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మెక్సికోలో రెడ్​ అలర్ట్​..

మెక్సికో నగరంతో పాటు 6 రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రమంలో రెడ్​ అలర్ట్​ ప్రకటించారు అధికారులు. శుక్రవారం నాటికి మెక్సికోలో 1,44,000 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. గత జనవరిలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నసమయంలో కంటే 4.6 శాతం ఎక్కువ. 2,43,733 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. వాస్తవంగా 3,70,000 మందివరకు చనిపోయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 25 శాతం దేశం హైఅలర్ట్​లో ఉంది. ఆ ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా లాక్​డౌన్​ విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

చైనాలో మళ్లీ ఆంక్షలు..

చైనాలోనూ డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 80 కేసులు వెలుగు చూశాయి. వీటిలో 58 కేసులు జియాంగ్సు ప్రావిన్సులోని యాంగ్​ఝౌ నగరంలోనివే. కొద్ది రోజుల క్రితం నాన్​జింగ్​ విమానాశ్రయంలో డెల్టా కేసులు బయటపడిన తర్వాత ఇప్పటి వరకు 1,200 మందికి వైరస్​ వ్యాపించింది. దీంతో చైనా మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నాన్​జింగ్​ సహా పలు ప్రాంతాల్లో లాక్​డౌన్​లు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయటం, ప్రయాణాలపై నిషేధం విధించింది.

కొవిడ్​ ఉద్ధృతి అధికంగా ఉన్న మరో 5 దేశాలు..

  • బ్రెజిల్​లోనూ వైరస్​ మళ్లీ పంజా విసురుతోంది. శుక్రవారం కొత్తగా 42వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వెయ్యి మందికిపైగా మరణించారు. 28వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 2,010,8,746కు చేరింది.
  • ఇండోనేసియాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 39వేలకుపైగా మంది వైరస్​ బారినపడ్డారు. 1635 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 వేల మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3,607,863, మరణాలు 1,04,010కు చేరింది.
  • ఇరాన్​లోనూ కొవిడ్​ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కొత్తంగా 34వేల మందికి వైరస్​ అంటుకుంది. 458 మంది మరణించారు.
  • బ్రిటన్​లో శుక్రవారం కొత్తగా 31వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. 92 మంది మరణించారు. 14వేల మంది కోలుకున్నారు.
  • ఫ్రాన్స్​లో 25వేలు, టర్కీలో 23వేలు, రష్యాలో 22వేలు, స్పెయిన్​లో 21వేలు, మలేషియాలో 20వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆయా దేశాల్లో వైరస్​ ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో కొత్త ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.

ఇదీ చూడండి:మళ్లీ కొవిడ్​ విజృంభణ- అమెరికాలో రోజుకు లక్ష!

ABOUT THE AUTHOR

...view details