తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ ప్రమాదకర వ్యాధిగా కరోనా: డబ్ల్యూహెచ్​ఓ

ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. తాజాగా ఈ వైరస్​ను పాన్​డెమిక్​(ప్రమాదకర వ్యాధి)గా పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ. మరోవైపు కరోనా వైరస్​ మరణాల జాబితాలో ఒక్కో దేశం వచ్చి చేరుతోంది. తాజాగా స్విడెన్​, ఇర్లాండ్​లో తొలి మరణాలు సంభవించాయి. వైరస్​ భయంతో కువైట్​.. తన విమాన సేవలను రద్దు చేసుకుంది. కరోనాతో పోరుకు వివిధ దేశాలు తమ ఆర్థిక అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

COVID-19
ప్రపంచ ప్రమాదకర వైరస్​గా కరోనా

By

Published : Mar 11, 2020, 11:44 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్​-19ని 'ప్రమాదకర వ్యాధి'​గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

"కోవిడ్​-19ని పాన్​డెమిక్​(ప్రమాదకర వ్యాధి)గా పేర్కొనవచ్చు. కరోనా వైరస్​ ఈ స్థాయిలో విజృంభించడం మనం మునుపెన్నడు చూడలేదు."

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

వైరస్​ కేంద్రబిందువైన చైనాలో.. ఇప్పటివరకు 3,100మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. సుమారు 81వేల వైరస్​ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షా 14వేలకుపైగా మంది ఈ వైరస్​ బారిన పడ్డారు.

జీ7 దేశాలు...

అమెరికాలోని పిట్స్​బర్గ్​ వేదికగా ఈ నెలలో జరగాల్సిన జీ7 దేశాల మంత్రుల సమావేశంపై కరోనా ప్రభావం పడింది. అమెరికాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరపాలని నిర్ణయించారు.

ఒకే రోజు 238 కేసులు...

బుధవారం ఖతార్​వాసులను కరోనా వైరస్​ భయాందోళనకు గురిచేసింది. ఒక రోజులో ఏకంగా 238 కేసులు నమోదవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఆ దేశంలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 262కు చేరింది.

దేశంలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే వైరస్​ కట్టడికి అనేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఖతాల్​ వ్యాప్తంగా అన్ని పాఠశాలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అనేక క్రీడా వేడుకలు రద్దయ్యాయి.

మరణాలు..

ఐరోపాలోని స్విడెన్​, ఐర్లాండ్​లో కరోనా వల్ల తొలి మరణాలు సంభవించాయి.

చైనా తర్వాత వైరస్​తో ఎక్కువ ప్రభావితమైన దేశం ఇటలీ​. ఫలితంగా ఇటలీ నుంచి ఒక్క దేశం సంబంధాలు తెంచుకుంటోంది. తాజాగా ఇటలీ సరిహద్దు దేశమైన ఆస్ట్రియా వైరస్​ కట్టడికి పలు చర్యలు చేపట్టింది. ఇటలీ వెంబడి ఉన్న సరిహద్దుపై పలు ఆంక్షలు విధించింది. ఇటలీకి రైలు, విమాన సేవలను ఇప్పటికే రద్దు చేసుకుంది ఆస్ట్రియా.

విమానాలు రద్దు..

కరోనా వైరస్​ ప్రభావం విమాన సేవలపై భారీగా పడుతోంది. ప్రపంచ దేశాలు తమ విమానాలను కరోనా బాధిత ప్రాంతాలకు పంపడానికి భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్​ కూడా తమ విమాన సేవలను రద్దు చేసుకుంది. ఈ శుక్రవారం నుంచి.. తదుపరి ఆదేశాలు వచ్చే అంత వరకు.. కువైట్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి కమర్షియల్​ ఫ్లైట్స్​ రాకపోకలు నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.

ఆర్థిక అస్త్రం..

కరోనాపై పోరుకు ప్రపంచదేశాలు తమ 'ఆర్థిక' అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా, ఇటలీ దేశాలు వైరస్​పై యుద్ధానికి బిలియన్​ డాలర్లను మంజురు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో కెనడా చేరింది. 1 బిలియన్​ డాలర్ల నిధులను కరోనా కట్టడి కోసం వినియోగించనున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details