విడవమంటే పాముకి కోపం.. కరవమంటే కప్పకి కోపం.. అన్నట్లుగా ఉంది ఇప్పుడు లాక్‌డౌన్ పరిస్థితి. ఆంక్షలను సడలిస్తే మహమ్మారి విజృంభణకు గేట్లెత్తినట్లు అవుతుందని ఒకవైపు డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు, ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎత్తేయకుంటే ప్రపంచం మరింతగా మాంద్యంలోకి జారిపోతుందని, పేదల జీవితాలు ఇంకా దుర్భరంగా మారుతాయని, నిరుద్యోగం తాండవిస్తుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమా? ఆర్థికమా? నిర్ణయించుకోలేని సంకట స్థితితో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. కొవిడ్-19తో కేసులు, మరణాల పరంగా తీవ్రంగా ప్రభావమైన తొలి ఎనిమిది దేశాలు ప్రస్తుతం ఏ విధానాలను అవలంభిస్తున్నారు... వాటి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేవి కీలకంగా మారాయి.
భిన్నాభిప్రాయాలు
ఆంక్షల సడలింపు విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, నిపుణుల మధ్య విబేధాలు ఉన్నాయి. ఆయా దేశాలు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్, జర్మనీలు లాక్‌డౌన్‌పై మే 3న చర్చిస్తామని ప్రకటించాయి. ఆర్థిక రంగం మళ్లీ క్రియాశీలమయ్యే క్రతువులో ఇదో కీలక మలుపు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
తెరపైకి ఆరోగ్య ధ్రువపత్రాలు
బ్రిటన్, అమెరికా, ఇంకా పలు ఇతర దేశాలు.. పౌరులకు కొవిడ్-19 పరీక్షల అనంతరం నెగిటివ్ ఉన్నవారికి ఆరోగ్య ధ్రువపత్రాలు ఇవ్వాలని యోచిస్తున్నాయి. ఈ పత్రాలు ఉన్నవారు విధులతో పాటు తమ సాధారణ పనులు చేసుకునేందుకు అనుమతిస్తారు. చిలీ ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కొంత మెరుగని అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచి కూడా చెబుతున్నారు.
మనదేశం ఏం చేస్తోంది...?
కరోనా కేసుల పరంగా భారత్ 17వ స్థానంలో ఉంది. జనాభాలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉండడం, వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న పరిస్థితిలో ఇండియాని ప్రపంచం మొత్తం గమనిస్తోంది. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ సంస్థలు, కీలక దేశాల నుంచి ప్రశంసలు అందుకున్న భారత్... 4 వారాల లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక బండిని నడిపేందుకు ఈనెల 20 నుంచి కొన్నింటికి సడలింపులిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా గ్రీన్‌జోన్లలో నిబంధనలను సడలించింది. ఇతర రాష్ట్రాలూ ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి.
అమెరికా..
కరోనా కేసులు, మరణాల్లో తొలిస్థానంలో ఉన్న అమెరికాలో పునఃప్రారంభానికి మూడు దశల ప్రణాళికను 16న ప్రకటించారు. కేసుల నమోదులో తగ్గుదలకు అనుగుణంగా మే 1 నుంచి షట్‌డౌన్ ఎత్తివేతకు అధ్యక్షుడు ట్రంప్ వీటిని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల గవర్నర్ల తుది నిర్ణయం మేరకు ఇది అమలవుతుంది. ప్రజలు ఈనెల 30 వరకూ భౌతిక దూరం పాటించాల్సిందే. మిషిగాన్, ఒహాయో, ఉత్తర కరోలినా, మిన్నెసోటా, ఉటా, వర్జీనియా, కెంటకీ, టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ తొలగించాలని ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రాట్ల పాలనలో ఉన్న మిన్నెసోటా, మిషిగాన్, వర్జీనియా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయాలని ట్రంప్ ట్విటర్ వేదికగా కోరారు. రిపబ్లిక్(ట్రంప్ పార్టీ) గవర్నర్ల పాలనలోని ఒహాయో, ఉటా రాష్ట్రాలకు ఈ సూచన చేయలేదు. అలానే పునఃప్రారంభం విషయంలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ప్రాంతీయంగా కూటములు కట్టి ముందడుగు వేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
ఇటలీ..
ఈనెల 13 నుంచి పలు పరిశ్రమలు, నిర్మాణరంగ పనులకు ఆమోదం తెలిపారు. దాదాపు 40 లక్షల మంది పనుల్లో చేరారు. ప్రజలకు పోలీసులు కోటి మాస్కులు అందజేశారు. నడక లేదంటే సైకిల్‌పై వెళ్లేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇతర నిబంధనలను ఈ నెల 26 వరకూ అమలు చేయనున్నారు.
ఫ్రాన్స్
యూరప్‌లో కేసులపరంగా మూడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ప్రకటించిన తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగించనుంది. ఆ తర్వాత ఎంతమందిని వీలైతే అంతమందినే విధులకు అనుమతించాలని యోచిస్తోంది. నిబంధనల్ని ఉల్లంఘించే వారికి జరిమానాలతోపాటు జైలు శిక్షలు విధిస్తోంది.