చైనా అనుకూల ప్రచారానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అమెరికా చట్టసభ ముందుకు బుధవారం ఓ కీలక బిల్లు వచ్చింది. ఆ దేశ సహకారంతో దుష్ప్రచారం సాగించే సంస్థలపై ఆంక్షలు విధించడమే ఈ బిల్లు బిల్లు ముఖ్య ఉద్దేశం. రిపబ్లికన్ సభ్యులు జిమ్ బ్యాంక్స్, టామ్ కాటన్ దీనిని ప్రతిపాదించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశీ విభాగమైన యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్ (యూఎఫ్డబ్ల్యూడీ) గురించి ఈ బిల్లులో ప్రముఖంగా ప్రస్తావించారు. యూఎఫ్డబ్ల్యూడీపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలా లేదా అనే అంశాన్ని విదేశాంగ మంత్రి పరిశీలించాలని బిల్లులో ప్రతిపాదించారు.
"అమెరికాలో నాయకత్వం మారినా చైనాతో పోరాటం ఆగలేదు. చైనా వైఖరి బహిర్గతమైంది. చైనాలో జరిగిన ఉయ్ఘుర్ ఊచకోత, క్రైస్తవుల అణచివేతలో యునైటెడ్ ఫ్రంట్ ప్రత్యక్షంగా పాల్గొంది. ఈ తరహా చర్యలను ప్రపంచవ్యాప్తం చేయడమే చైనా లక్ష్యం"
-జిమ్ బ్యాంక్స్, రిపబ్లికన్ స్టడీ కమిటీ ఛైర్మన్