తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్xబైడెన్: అమెరికాలో నిరసనల హోరు - న్యూయార్క్​లో నిరసనలు అమెరికా ఫలితాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా స్పష్టతరాకపోవడం సహా డొనాల్డ్ ట్రంప్ న్యాయ పోరాటానికి దిగిన వేళ ట్రంప్ అనుకూల వ్యతిరేక వర్గాల నిరసనలతో అగ్రరాజ్యం హోరెత్తుతోంది. ప్రతి ఓటు లెక్కించాలనే డిమాండ్‌తో పలు నగరాల్లో ఆందోళనకారులు నినాదాలు చేయగా మరికొన్ని చోట్ల ట్రంప్ వెళ్లిపోవాలనే డిమాండ్‌తో ప్రత్యర్థి వర్గీయులు ర్యాలీ తీశారు. ట్రంప్ అనుకూల వర్గం కూడా అక్రమ ఓట్లు లెక్కించవద్దంటూ కొన్ని చోట్ల నిరసనలకు దిగింది.

us election news
ట్రంప్xబైడెన్: అగ్రరాజ్యంలో ఆందోళనల హోరు

By

Published : Nov 5, 2020, 12:20 PM IST

Updated : Nov 5, 2020, 3:43 PM IST

అమెరికాలో నిరసనల హోరు

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే దేశంలో నిరసనలు పెల్లుబుకాయి. ప్రతి ఓటును లెక్కించండంటూ ట్రంప్ వ్యతిరేక వర్గాలు ఆందోళనకు దిగాయి. ఓట్లను ట్రంప్ దోచుకోకుండా చేయాలంటూ నినాదాలు చేశాయి. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు సైతం వీధుల్లో నిరసనలు చేపట్టారు.

న్యూయార్క్

అధ్యక్ష ఎన్నికల్లో ప్రతి ఓటునూ లెక్కించాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్‌లోని వాషింగ్టన్ స్క్వేర్ వద్ద నిరసనలు జరిగాయి. కూడలిలో బైఠాయించిన ఆందోళనకారులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, వర్ణ వివక్షను రూపుమాపాలని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారిలో కొందరు... మిషిగన్, పెన్సిల్వేనియాలో ట్రంప్‌ దావా వార్తలతో హింసకు పాల్పడగా... కనీసం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూయార్క్​లో వస్తువులకు నిప్పంటించిన నిరసనకారులు

ఫిలడెల్ఫియా

ప్రతి ఓటూ లెక్కించాలనే డిమాండ్‌తో ఫిలడెల్ఫియాలోనూ ఆందోళన నిర్వహించారు. కార్మిక సంఘాలకు చెందిన 200 మంది ప్రతినిధులు ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ హాల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తామంతా వీధుల్లోకి వచ్చినట్లు చెప్పారు.

ఫిలడెల్ఫియాలో నిరసనలు

సియాటెల్‌లోనూ నిరసనలు జరిగాయి. 'నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమే' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఓటును లెక్కించాలని కోరారు.

సియాటెల్‌లో నిరసనకారులు

మాన్​హట్టన్

ఎన్నికలో ప్రతి ఓటును లెక్కించాలని మాన్​హట్టన్​లో ప్రదర్శన నిర్వహించారు నిరసనకారులు. న్యాయం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా ర్యాలీలు చేశారు. ఆందోళనలు దాదాపు శాంతియుతంగానే జరిగాయి. అయితే 'పోలీసుల దుష్ప్రవర్తన'కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినందుకు 20 మందిని అరెస్టు చేశారు.

'ట్రంప్ వెళ్లిపో'

ట్రంప్ వెళ్లిపోవాలనే డిమాండ్‌తో షికాగోలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. 'ప్రతి ఓటూ లెక్కించాలి', 'ట్రంప్ వెళ్లిపో' అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలని డిమాండ్ చేశారు.

చికాగోలో భారీ ర్యాలీ

ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఓట్లన్నీ లెక్కించాలనే డిమాండ్‌తో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. కొన్ని చోట్ల భవనాల కిటికీలను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్‌ను ప్రభుత్వం వెంటనే రంగంలోకి దించింది. మిన్నియాపొలిస్‌లో ఆందోళన చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోర్ట్​లాండ్​లో జాతీయ పతాకానికి నిప్పుపెడుతున్న నిరసనకారుడు

ట్రంప్ అనుకూల నిరసనలు

మిషిగన్‌లో ఓట్ల లెక్కింపు నిలిపివేయాలనే డిమాండ్‌తో అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు డెట్రాయిట్‌లో ఆందోళన నిర్వహించారు. జో బైడెన్‌ మిషిగన్‌లో గెలిచినట్లు వార్తలు రాగానే ఓట్లు లెక్కించే కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఫీనిక్స్‌లో ట్రంప్ అనుకూల వర్గం ఆందోళన

ఆరిజోనాలోని ఫీనిక్స్‌ నగరంలోనూ ట్రంప్ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న ఆరిజోనా రాష్ట్రంలో బైడెన్‌ గెలవడం వల్ల ఆందోళనలు చెలరేగాయి. అమెరికా జాతీయ జెండాలు పట్టుకుని 'వీ లవ్ ట్రంప్' అంటూ నినాదాలు చేశారు. మయామీలోనూ ట్రంప్, బైడెన్ వర్గాలు పోటాపోటీ నిరసనలు చేశాయి.

ఇదీ చదవండి-ఒబామా రికార్డును బ్రేక్ చేసిన బైడెన్

Last Updated : Nov 5, 2020, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details