తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు! - coronavirus latest news china

న్యూయార్క్​లో కరోనా విజృంభణ ఫిబ్రవరిలోనే మొదలైందా? అగ్రరాజ్యానికి వైరస్​ వచ్చింది చైనా నుంచి కాదా? ఐరోపా నుంచా? ట్రంప్​ సర్కార్​ మాత్రం ఈ 2 విషయాల్ని విస్మరించి... ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిందా? ఔననే అంటోంది ఓ నివేదిక.

corona science
ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు!

By

Published : Apr 9, 2020, 2:38 PM IST

న్యూయార్క్... అమెరికా వాణిజ్య రాజధాని. కానీ ఇప్పుడు... కరోనాకు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్​స్పాట్​. నగర చరిత్రలో పెను విపత్తుగా పిలిచే 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రెట్టింపు సంఖ్యలో వైరస్​కు బలయ్యారు ప్రజలు. ఇదంతా ఒక వారంలోనో, 10 రోజుల్లోనో జరిగిందా? నిన్నమొన్నటి వరకు అగ్రరాజ్య పెద్దలు చెప్పినట్లు కరోనా వైరస్​ చైనా నుంచే వచ్చిందా? కాదంటున్నారు నిపుణులు.

న్యూయార్క్​ విశ్వవిద్యాలయం పరిధిలోని గ్రాస్​మ్యాన్​ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​లో జన్యుశాస్త్రవేత్త అయిన ఆడ్రియానా హీగై... కరోనా వ్యాప్తిపై విస్తృత పరిశోధన చేశారు. వైరస్​ ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా, ఎప్పుడు వ్యాప్తి చెందిందనే విషయాలు కనుగొన్నారు. పరోక్షంగా... వైరస్​పై పోరులో అమెరికా ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని తెలియచెప్పారు.

ఫిబ్రవరిలోనే..

ఆడ్రియానా బృందం పరిశోధన ప్రకారం... "కరోనా వైరస్​ ఫిబ్రవరిలోనే అమెరికాకు వ్యాపించింది. న్యూయార్క్​లో అనేక మంది ప్రజలు అంతుచిక్కని నిమోనియాతో ఆసుపత్రులకు బారులు తీరారు. వైద్యులు సాధారణ చికిత్స అందించారు. అప్పటికి అమెరికాలో కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించలేదు. అందుకే వైరస్ గుట్టు ఎవరికీ తెలియలేదు. ఈలోపే అపార నష్టం జరిగిపోయింది.

చైనాపై టార్గెట్... ఐరోపా పట్ల అలసత్వం

కరోనా విషయంలో ముందు నుంచి చైనానే లక్ష్యంగా చేసుకుంది ట్రంప్​ సర్కార్. వైరస్​ చైనా నుంచే వస్తోందని పదేపదే చెబుతూ... తొలుత ఆ దేశానికి మాత్రమే విమాన రాకపోకలు నిలిపివేసింది. కానీ... అగ్రరాజ్యానికి ఐరోపా దేశాల నుంచే కరోనా వచ్చిందని ఆడ్రియానా బృందం పరిశోధనలో తేలింది.

ఎలా గుర్తించారు?

బ్రూక్లిన్​లోని వింత్​ట్రాప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 మంది బాధితుల నమూనాల్లోని వైరస్ క్రమాన్ని గుర్తించడం ద్వారా ఈ విషయం కనుగొన్నారు.

అన్ని వైరస్ కణాలు కాల క్రమేణా వృద్ధి చెందుతాయి. కానీ ఆర్​ఎన్​ఏ వైరల్​ కుటుంబానికి చెందిన కొవిడ్-19లో సమయం గడిచే కొద్దీ వైరస్ క్రమం దెబ్బతింటుంది. ఈ కారణంగా వైరస్​లో మార్పులను, జన్యుక్రమాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు వీలయ్యింది. వైరస్​లోని డీఎన్​ఏను గుర్తించడం ద్వారా ఎక్కడి నుంచి వచ్చిందో నిర్ధరించారు పరిశోధకులు.

ఇంగ్లాండ్​ నుంచే..

ఆడ్రియానా బృందం పరీక్షించిన తొలి వ్యక్తి ప్రయాణాలు చేయలేదు. స్థానికంగానే అతడికి వైరస్ సోకిందని నిర్ధరించారు. అతడిలో ఉన్న వైరస్ కణాల్లో మార్పులను, డీఎన్​ఏ క్రమాన్ని విశ్లేషించిన అనంతరం ఇంగ్లాండ్​ నుంచి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

చికిత్స విధానాల్లో మార్పు దిశగా..

తమ పరిశోధన ద్వారా వైరస్ తీవ్రతను గుర్తించి, ఆ మేరకు చికిత్స విధానాల్లో మార్పులు చేసేందుకు వీలవుతుందని చెప్పారు శాస్త్రవేత్తలు. వైరస్ తీవ్రతపై అవగాహన వచ్చిన అనంతరం లాక్​డౌన్​ కొనసాగింపు పైనా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. రెండోసారి కేసుల ఉద్ధృతి పెరిగితే.. పరిశోధన వివరాలను తాజా కేసులతో పోల్చడం ద్వారా వైరస్ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుందని వెల్లడించారు.

మరింత విశ్లేషణ..

మరింత విస్తృతంగా ఈ అంశమై పరిశోధన కొనసాగించాలని తెలిపారు శాస్త్రవేత్తలు. వారానికి 200 నమూనాలు పరిశీలన లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తద్వారా మరింత స్పష్టంగా వైరస్​ను అరికట్టే చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:హేమాహేమీల్నీ వదలని కరోనా.. ఎవరెవరంటే?

ABOUT THE AUTHOR

...view details