వేలాది భారతీయ నిపుణులు సహా.. ఎందరో వలసదారులకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా. హెచ్1బీ వీసాల విషయంలో ఆందోళన చెందుతున్నవారికి శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారులు, అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) కోసం దరఖాస్తు చేసుకున్నవారు సంబంధిత పత్రాలు సమర్పించేందుకు మరో 60 రోజులు సమయమిచ్చింది.
గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు శుభవార్త- మరో 60 రోజులు గడువు! - Green Card
కరోనా విజృంభణ దృష్ట్యా అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలు సమర్పించేందుకు 60 రోజుల అదనపు గడువు ఇచ్చింది.
హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు వివిధ పత్రాలు జతపరచాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్). అమెరికాలో ఉండాలనుకోవడానికి, వీసా తిరస్కరణ, రద్దుకు గల కారణాలను కోరింది.
హెచ్1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తుల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు ఇది అనుమతినిస్తుంది. ఫలితంగా అమెరికా టెక్ కంపెనీలు... భారత్, చైనా లాంటి దేశాల నుంచి ఏటా వేలాది మంది నిపుణులకు ఉద్యోగాలిస్తున్నాయి.