తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్వయా'కిల్' నగరం.. ఎటు చూసినా శవాల మయం! - Corona out break in the World

ఈక్వెడార్‌లోని గ్వయాకిల్​ నగరం.. కరోనా ధాటికి వణికిపోతోంది. ఎటు చూసినా కుప్పలుతెప్పలుగా శవాలే కనిపిస్తున్నాయి. కనీసం అంతిమయాత్రకు శవపేటికలు కూడా దొరకడం లేదు. ఫుట్​పాత్​లపైనే మృతదేహాలను వదిలేస్తున్నారు. అసలు ఈ దుర్భర పరిస్థితికి కారణమేంటి?

Coronavirus: Overcrowded hospitals and crematoriums in Guayaquil, Ecuador
గ్వయా'కిల్‌'.. ఈ నగరానికి ఏమైంది?

By

Published : Apr 13, 2020, 1:00 PM IST

కరోనాపై నిర్లక్ష్యం ఈక్వెడార్‌ను హృదయవిదారక పరిస్థితుల్లోకి నెట్టేసింది. భౌతిక దూరం పాటించడంలో విఫలం కావడం, కొందరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ దేశానికి శాపంగా పరిణమించాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొవిడ్‌-19 వ్యాప్తిని మరింతగా ఎగదోశాయి. అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే శవపేటికలు కూడా దొరకడంలేదు. మృతదేహాలను వీధుల్లో ఫుట్‌పాత్‌లపై వదిలేస్తున్నారు. గ్వయాకిల్‌ నగరంలో పరిస్థితి మరీ దుర్భంగా ఉంది.

ఎందుకిలా?

కేవలం 1.7 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్‌లో రోగుల సంఖ్య, మరణాల నిష్పత్తి ఎక్కువగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఈ దేశానికి స్పెయిన్‌తో విడదీయలేని బంధం ఉంది. ఇక్కడ అధికారిక భాష స్పానిష్‌. ఈక్వెడార్‌ వాసులు స్పెయిన్‌, ఇటలీలకు వలస వెళుతుంటారు. ప్రస్తుతం ఈ రెండు దేశాలు కరోనా వైరస్‌కు కేంద్రాలుగా మారిపోయాయి. ఫిబ్రవరి 29న ఓ 70 ఏళ్ల మహిళ స్పెయిన్‌ నుంచి ఈక్వెడార్‌లోని గ్వయాకిల్‌ పట్టణానికి వచ్చింది. ఆమెలో కరోనా లక్షణాలు బయటపడటం వల్ల నిర్బంధానికి తరలించారు. ఆమెతో సంబంధం ఉన్న మరో 80 మందిని గుర్తించి క్వారంటైన్‌ చేశారు. కానీ, ఆ తర్వాత స్పెయిన్‌లో కరోనా వైరస్‌ విజృంభించడం వల్ల అక్కడ చదువుతున్న విద్యార్థులు భారీ సంఖ్యలో తిరిగి వచ్చారు. అదే సమయంలో గ్వయాకిల్‌లో కొందరు సంపన్నుల ఇళ్లల్లో జరిగిన పెళ్లి వేడుకలకు వారు హాజరుకావడం వల్ల సూపర్‌ స్ప్రెడ్‌ ఘటనలుగా మారాయి. అక్కడ్నుంచి ఈ అంటువ్యాధి మురికివాడలకు చేరింది.

పేదలకు తప్పని కష్టాలు..

కరోనావైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఈక్వెడార్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రజలకు నెలకు 60 డాలర్లు ఇస్తామని ప్రకటించింది. సంపన్నులు ఇళ్లలోనే ఉన్నారు. కానీ, పూటగడవని పేదలు పనులకు వెళ్లడం ఆపలేదు. దీనికి తోడు ప్రభుత్వం ఇస్తున్న డబ్బు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద జనం చేరడం వల్ల మరింతగా వ్యాధి వ్యాపించడం మొదలుపెట్టింది. కొందరు యాచనచేసి ఆహారం సంపాదించేందుకు ఇంటింటికి తిరుగుతూ వ్యాధిబారిన పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కిక్కిరిసిన ఆసుపత్రులు.. శ్మశానాలు..

ఈక్వెడార్‌లోని కొవిడ్‌ కేసుల్లో 70 శాతానికిపైగా గ్వాయస్‌ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇక్కడ ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. చివరికి మృతదేహాల అప్పగింతకూ రోజుల కొద్దీ సమయం పడుతోంది. గ్వయాకిల్‌లో అత్యవసర వైద్యం అందించే ఫోన్‌ నంబరు ఎప్పుడూ బిజీ అనే వస్తోంది. ఇక్కడ మృతుల సంఖ్య అధికారికంగా చెప్పిన దానికి కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు లెనిన్‌ మొరెనో స్వయంగా అంగీకరించారు. పరీక్షలు చేయకపోవడం వల్ల వారివి కొవిడ్‌-19 మరణాలుగా చూపడంలేదు. చివరికి మృతదేహాలను తరలించేందుకు పేటికలు కరవై అరటిపళ్ల రవాణాకు ఉపయోగించే కార్డ్‌బోర్డ్‌తో శవపేటికలు చేస్తున్నారు. శ్మశానాలు కూడా కిక్కిరిసిపోయాయి.

  • మార్చి చివరి నాటికి గ్వయాకిల్‌లో ఇళ్ల నుంచే 1,350 మృతదేహాలను తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
  • పాలిథిన్‌ కవర్లలో చుట్టిన కొన్ని మృతదేహాలను ఇళ్లలో, వీధుల్లోనే రోజుల తరబడి ఉంచుతున్నారు. గత వారం ఇలాంటివి 150 వరకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాపై ప్లాస్మా థెరపీ అస్త్రం- కోలుకున్న ముగ్గురు ప్రవాసులు

ABOUT THE AUTHOR

...view details