ప్రపంచదేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ పుట్టుకపై అమెరికా రోజుకో మాట చెబుతోంది. కరోనా మానవుల సృష్టి కాదని.. అగ్రరాజ్య నిఘా సంస్థలు తేల్చిచెప్పాయి. అయితే మొదటినుంచీ చైనానే కారణం అని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి ఆ దేశం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కొవిడ్ వైరస్.. చైనా వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని ఉద్ఘాటించారు. ఇందుకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపిన ఆయన... వివరాలను వెల్లడించడానికి మాత్రం ఇష్టపడలేదు. దీనిపై ఇంకా లోతైన విచారణ జరుగుతోందని.. త్వరలోనే వాటి ఫలితాలు బయటకు వస్తాయని చెప్పారు.
వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని అంత కచ్చితంగా ఎలా చెప్పగలరని విలేకరులు ప్రశ్నించగా..''నేను ఆ విషయాలు బయటకు చెప్పలేను. అలా చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు'' అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయంలో తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను బాధ్యుణ్ని చేయలేనన్నారు. కానీ, ఆదిలోనే మహమ్మారిని కట్టడి చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అసలు చైనాలో ఏం జరిగిందన్నది మాత్రం తప్పకుండా తెలుసుకోవాలని, దానిపైనే విచారణ జరుగుతోందన్నారు ట్రంప్.
''చైనా కట్టడి చేయలేకపోయిందా లేక కావాలనే నిర్లక్ష్యం వహించిందా అన్నది పక్కనబెడితే.. దీని ప్రభావం మాత్రం ప్రపంచంపై భారీ స్థాయిలో ఉంది. కీలక సమయంలో స్పందించకపోవడం వల్లే పరిస్థితి చేజారిపోయి ఉంటుందని భావిస్తున్నా.''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల ముందు.. అమెరికా నిఘా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. కరోనా వైరస్ మానవులు సృష్టించింది కాదని, అది జన్యు మార్పిడి ద్వారా తయారైంది కాదని వివరించాయి. వైరస్‌తో వుహాన్ ల్యాబ్‌కు సంబంధం ఉందా? లేక జంతువుల నుంచి వచ్చిందా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నట్టు తెలిపాయి.